TATA IPL 2022 - LSG vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం కేకేఆర్-రాజస్తాన్ మధ్య అసలైన క్రికెట్ మజాను ఆస్వాదించిన ఐపీఎల్ అభిమానులకు అంతకు మించి  అనుభూతిని ఇచ్చేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - లక్నో సూపర్ జెయింట్స్ సిద్ధమయ్యాయి. 

ఐపీఎల్-15 లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొనబోతున్నాయి. ముంబైలోకి డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ బ్యాటింగ్ కు రానుంది. ఇరు జట్లు గత మ్యాచులో ఆడిన సభ్యులతోనే ఆడుతున్నాయి. మార్పులేమీ లేవు. 

ఈ సీజన్ లో ఇప్పటివరకు ఇరు జట్లు చెరో ఆరు మ్యాచులాడాయి. ఇందులో నాలుగు మ్యాచులు గెలిచి రెండింట్లో ఓడాయి. తొలి మ్యాచ్ లో గుజరాత్ తో ఓడినా తర్వాత చెన్నై, హైదరాబాద్, ఢిల్లీపై నెగ్గింది. అయితే రాజస్తాన్ పై ఓడినా.. తిరిగి ఇటీవలే ముంబై తో జరిగిన పోరులో గెలిచి విజయాల బాట పట్టింది. ఈ మ్యాచ్ లో కూడా దానినే కొనసాగించాలని భావిస్తున్నది. 

ఇక ఆర్సీబీ కూడా తొలి మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడింది. కానీ ఆ తర్వాత వరుసగా కోల్కతా, రాజస్తాన్, ముంబై లపై గెలిచింది. ఆ తర్వాత చెన్నైతో ఓడినా తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ తో గెలిచి గాడిలో పడింది.

పాయింట్ల పట్టికలో తలో 8 పాయింట్లతో సమానంగా ఉన్నా మెరుగైన రన్ రేట్ కారణంగా లక్నో మూడో స్థానంలో ఉండగా బెంగళూరు నాలుగో స్థానంలో ఉంది.

బలాబలాల విషయానికొస్తే.. బ్యాటింగ్ లో ఆర్సీబీకి డుప్లెసిస్ ఫామ్ కలవరపరుస్తున్నది. కోహ్లి తొలి రెండు మ్యాచ్ లలో ఆడినా తర్వాత విఫలమవుతున్నాడు. అనూజ్ రావత్ ప్రదర్శన కూడా అంతంతమాత్రమే. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ గత మ్యాచ్ లో దినేశ్ కార్తీక్ తో కలిసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్ లో షాబాజ్ అహ్మద్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ తరఫున అత్యంత విజయవంతమైన ఆటగాడు ఎవరైనా ఉన్నారా..? అంటే అది దినేశ్ కార్తీకే. అతడిపైనే బెంగళూరు మరోసారి ఆశలు పెట్టుకున్నది. బౌలింగ్ లో సిరాజ్, హెజిల్వుడ్, హర్షల్ పటేల్ లతో పేస్ విభాగం పటిష్టంగా ఉండగా స్పిన్నర్ వనిందు హసరంగ మాయ చేస్తున్నాడు. 

ఇక లక్నో పై ఓ కన్నేస్తే... గత మ్యాచ్ లో ముంబైపై వీర విహారం చేసి సెంచరీ బాదాడు ఎల్ఎస్జీ సారథి కెఎల్ రాహుల్. అతడికి తోడు డికాక్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు. వీరి తర్వాత వచ్చే మనీష్ పాండే, దీపక్ హుడా, అయుష్ బదోని, స్టోయినిస్ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్ లో కూడా అవేశ్ ఖాన్, దుష్మంత చమీరతో పాటు స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ లు రాణిస్తున్నారు. 

తుది జట్లు : 

లక్నో సూపర్‌ జెయింట్స్‌: కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్), డికాక్‌, మనీశ్‌ పాండే, స్టోయినిస్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్యా, ఆయుష్‌ బదోని, జేసన్‌ హోల్డర్‌, దుష్మంత్ చమీర, రవి బిష్ణోయ్‌, ఆవేశ్‌ ఖాన్‌ 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: డుప్లెసిస్‌ (కెప్టెన్), అనూజ్‌ రావత్‌, విరాట్‌ కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, ప్రభుదేస్సాయ్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌, వనిందు హసరంగ, హర్షల్‌ పటేల్‌, హేజిల్‌వుడ్‌, సిరాజ్‌