Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: కోల్‘కథ’ ముగిసింది.. పోరాడి ఓడిన కేకేఆర్.. రెండు పరుగుల తేడాతో లక్నో విజయం

IPL 2022 LSG vs KKR:  ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కథ ముగిసింది. లీగ్ దశను విజయంతో ప్రారంభించిన  ఆ జట్టు.. ఓటమితో ముగించింది. బుధవారం లక్నో తో తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో లక్నోనే విజయం వరించింది. రెండు పరుగుల తేడాతో  రాహుల్ సేన విజయాన్ని అందుకుంది.

TATA IPL 2022:  LSG Beat  KKR by 2 runs in High Voltage Game
Author
India, First Published May 18, 2022, 11:29 PM IST

ప్లేఆఫ్ రేసులో ఆశలు నిలుపుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో కేకేఆర్ పోరాడి ఓడింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండు  పరుగుల తేడాతో అపజయం పాలైంది. ఆఖరి బంతి వరకు సాగిన హై స్కోరింగ్ థ్రిల్లర్ లో కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా,  ఆండ్రీ రసెల్ లు పోరాడినా.. ఆఖర్లో రింకూ సింగ్, సునీల్ నరైన్ లు వణికించినా ఫలితం లేకుండా పోయింది. రెండు పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది.  ఈ రెండు జట్లకు ఐపీఎల్-15 లో ఇదే చివరి లీగ్ మ్యాచ్. ఓటమితో మొదలుపెట్టిన లక్నో లీగ్ దశను విజయంతో ముగించగా..  చెన్నై పై విజయంతో సీజన్ ను ప్రారంభించిన కేకేఆర్.. ఓటమితో లీగ్ నుంచి నిష్క్రమించింది.

ఈ విజయంతో లక్నో అధికారికంగా ప్లేఆఫ్స్   చేరిన రెండో జట్టు కాగా.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన మూడో జట్టు (ముంబై, చెన్నైల తర్వాత)గా  కేకేఆర్ నిలిచాయి.ఈ గెలుపుతో లక్నో తిరిగి  పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది. అయితే రాజస్తాన్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో ఈ రెండు జట్ల మధ్య టాప్-2 కోసం పోటీ పడే ఛాన్స్ ఉంది.

కళ్లెదుట భారీ లక్ష్యం కనిపిస్తున్నా  కోల్కతా ఓపెనర్ల ఆటతీరు మాత్రం మారలేదు.  సీజన్ లో  విఫలఫామ్ ను కొనసాగిస్తూ.. వెంకటేశ్ అయ్యర్ (0) రెండో బంతికే డకౌట్ అయ్యాడు.  మూడో ఓవర్లో  అభిజిత్ తోమర్ (4) కూడా లక్నో కెప్టెన్ కెఎల్ రాహుల్  కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసేసరికి స్కోరు బోర్డు పై పది పరుగులు చేరకుండానే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది కేకేఆర్. 

కానీ వన్ డౌన్ లో వచ్చిన నితీశ్ రాణా (22 బంతుల్లో 42.. 9 ఫోర్లు) తో కలిసి శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు)  దూకుడుగా ఆడారు.  పవర్  ప్లేను సమర్థవంతంగా వినియోగించుకున్నారు. అవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా ఐదు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన జేసన్ హోల్డర్ బౌలింగ్ లో శ్రేయస్.. 4, 6, 4 బాదాడు.   కృష్ణప్ప గౌతమ్ వేసిన ఆరో ఓవర్లో రాణా.. మళ్లీ హ్యాట్రిక్ ఫోర్లు  కొట్టాడు.  కానీ గౌతమ్ వేసిన 8వ ఓవర్ తొలి బంతికి.. స్టోయినిస్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  దీంతో 56 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.  

నితీశ్ ఔటైనా.. సామ్ బిల్లింగ్స్ (24 బంతుల్లో 36.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తో కలిసి శ్రేయస్ జోరు కొనసాగించాడు. అవేశ్ ఖాన్ వేసిన పదో ఓవర్లో.. బిల్లింగ్స్ 6, 4, 4, బాదాడు.  ఈ ఇద్దరి దూకుడుతో పదో ఓవర్లో కేకేఆర్ స్కోరు వంద దాటింది. ఇక రవి బిష్ణోయ్ వేసిన 11వ ఓవర్లో  శ్రేయస్ రెండు ఫోర్లు కొట్టాడు.  ఈ క్రమంలో  రాహుల్ బంతిని స్టోయినిస్ కు ఇచ్చాడు. అతడు వేసిన 14వ ఓవర్లో 2 పరుగులు తీసి హాఫ్ సెంచరీ చేసిన  శ్రేయస్.. తర్వాత బంతికే దీపక్ హుడా కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లు ముగిసేసరికి  కేకేఆర్  స్కోరు 4 వికెట్ల నష్టానికి 136 పరుగులు.

కేకేఆర్ విజయానికి 36 బంతుల్లో 76 పరుగులు అవసరమనగా.. 16వ ఓవర్లో నాలుగో బంతికి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో బిల్లింగ్స్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన మోహ్సిన్ ఖాన్.. కేకేఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రసెల్ (5) ను ఔట్  చేసి ఆ జట్టుకు కోలుకోని దెబ్బ కొట్టాడు. 

భయపెట్టిన రింకూ-నరైన్ 

రసెల్ ను ఔట్ చేసిన ఆనందం లక్నో కు దక్కకుండా చేశారు సునీల్ నరైన్ (7 బంతుల్లో 21 నాటౌౌట్.. 3 సిక్సర్లు), రింకూ సింగ్ (15 బంతులలో 40.. 2 ఫోర్లు, 4 సిక్సర్లు). రావడం రావడమే సిక్సర్ బాదిన నరైన్.. ఆ తర్వాత కూడా అదే జోరు సాగించాడు. అవేశ్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో..  ఈ ఇద్దరూ తలో సిక్సర్ బాదారు.  ఆ ఓవర్లో 17 పరుగులొచ్చాయి.  ఇక హోల్డర్ వేసిన 19వ ఓవర్లో కూడా ఇదే రిపీట్ అయింది.  ఆ ఓవర్లో కూడా 17 పరుగులొచ్చాయి. ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్ బౌలింగ్ లో  రింకూ సింగ్ రెచ్చిపోయాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన అతడు.. రెండు, మూడు బంతులను  స్టాండ్స్ లోకి పంపాడు. దీంతో సమీకరణం 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సి వచ్చింది.  అయితే ఐదో బంతికి రింకూ సింగ్ ఔట్. ఉత్కంఠ మరింత పెరిగింది. ఆఖరి బంతికి ఉమేశ్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. కానీ స్టోయినిస్ వేసిన యార్కర్.. ఆఫ్ స్టంప్ ను ఎగురగొట్టింది. అంతే.. లక్నో ఆటగాళ్ల సంబురం అంబరాన్నంటింది.  

లక్నో బౌలర్లలో యువ పేసర్ మోహ్సిన్ ఖాన్  నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. స్టోయినిస్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. గౌతమ్, రవి బిష్ణోయ్ లు తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ కు ఓపెనర్లు  భారీ స్కోరు చేసి పెట్టారు. క్వింటన్ డికాక్ (140 నాటౌట్), కెఎల్ రాహుల్ (68 నాటౌట్) లు  దుమ్ము రేపే ప్రదర్శనతో  నిర్ణీత 20 ఓవర్లలో లక్నో వికెట్లేమీ కోల్పోకుండా 210 పరుగులు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios