TATA IPL 2022 - KKR vs DC: రెండేండ్ల క్రితం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ కు చేర్చిన శ్రేయస్ అయ్యర్.. తర్వాత సీజన్ లో గాయపడ్డాడు. అయితే అతడు తిరిగొచ్చినా ఢిల్లీ మాత్రం అతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. నేటి మ్యాచులో కేకేఆర్ సారథి మళ్లీ టాస్ గెలిచాడు.
ఐపీఎల్ 2020 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఫైనల్ కు చేర్చిన ఘనత ఆ జట్టు అప్పటి సారథి శ్రేయస్ అయ్యర్ ది. అయితే 2021 సీజన్ లో అతడికి భుజం గాయం నొప్పి కారణంగా ఐపీఎల్ లో అర్థాంతరంగా తప్పుకున్నాడు. దుబాయ్ లో జరిగిన రెండో దశ సీజన్ కు అతడు తిరిగొచ్చినా ఢిల్లీ మాత్రం రిషభ్ పంత్ నే కెప్టెన్ గా కొనసాగించింది. దీనిపై గతంలోనే నిరాశ వ్యక్తం చేసిన అయ్యర్.. ఏకంగా ఈసారి ఆ జట్టు నుంచే తప్పుకున్నాడు. ఐపీఎల్ వేలంలోకి వచ్చి కోల్కతా నైట్ రైడర్స్ కు సారథి అయ్యాడు. 2015లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభం నుంచి ఢిల్లీతోనే ఉన్న అయ్యర్.. తొలిసారి ఢిల్లీకి వ్యతిరేకంగా ఆడనున్నాడు. తనను కెప్టెన్సీ నుంచి తొలగించిన ఢిల్లీ యాజమాన్యంపై పగ తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
కాగా బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు నాలుగు మ్యాచులలో మూడు గెలిచి టేబుల్ టాపర్లుగా కేకేఆర్ ఉండగా.. ఆడిన 3 మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచి రెండింటిలో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్.
నేటి మ్యాచులో కేకేఆర్ గత మ్యాచులో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడుతుండగా.. ఢిల్లీ మాత్రం ఒక మార్పుతో ఆడుతున్నది.
గత వారం ముంబై ఇండియన్స్ తో ముగిసిన ఉత్కంఠభరిత మ్యాచులో కేకేఆర్ బౌలర్ ప్యాట్ కమిన్స్ వీర విధ్వంసం (15 బంతుల్లో 56 నాటౌట్) కారణంగా వచ్చిన విజయం జోరును తిరిగి కొనసాగించాలనుకుంటున్న కేకేఆర్ ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇక గత మ్యాచులో ఓడిన ఢిల్లీ.. మళ్లీ విజయాల బాట పట్టాలని యోచిస్తున్నది.
ముఖాముఖి : ఇప్పటివరకు ఐపీఎల్ లో ఇరు జట్లు 29 సార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ 16 మ్యాచుల్లో గెలవగా.. ఢిల్లీ 12 మ్యాచుల్లో నెగ్గింది. ఇక గత 5 మ్యాచుల్లో.. 3 కేకేఆర్.. 2 ఢిల్లీ గెలిచాయి.
తుది జట్లు :
కోల్కతా నైట్ రైడర్స్ : వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, సామ్ బిల్లింగ్స్, నితీశ్ రాణా, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమిన్స్, ఉమేశ్ యాదవ్, రసిక్ సలమ్, వరుణ్ చక్రవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, రొమెన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, షార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్
