TATA IPL 2022 GT vs SRH: ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ లో వరుస విజయాలతో జోరు మీదున్న రెండు జట్లు మళ్లీ రెండో దఫా పోరుకు ఢీ అంటే ఢీ అంటున్నాయి. జోరు కొనసాగించాలని హైదరాబాద్ అనుకుంటుండగా ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్ భావిస్తున్నది.
గుజరాత్ వర్సెస్ హైదరాబాద్.. ఈ మధ్య పొలిటికల్ సర్కిల్స్ లో ఇది చాలా ఫేమస్. గత కొద్దికాలంగా కేంద్ర, రాష్ట్రా (తెలంగాణ)ల మధ్య పలు అంశాల మీద పోటాపోటీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు రెండు చోట్ల అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు. ఇది కాస్తా ఇప్పుడు క్రికెట్ కు కూడా పాకింది. రెండు రాజకీయ పార్టీల నాయకులు క్రికెట్ ఆడుతున్నారనుకుంటున్నారేమో..? అస్సలు కాదు. ఐపీఎల్ లో వరుస విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్-గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో రెండో సారి తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. 8 మ్యాచులలో టాస్ ఓడిపోవడం కేన్ మామకు ఇదే తొలిసారి. ఈ రెండు జట్లలో ఎవరు గెలిస్తే వాళ్లు పాయింట్ల పట్టికలో టాప్ కు చేరుకుంటారు. గుజరాత్ జట్టులో మార్పులేమీ లేవు. ఎస్ఆర్హెచ్ తరఫున వాషింగ్టన్ సుందర్ (జగదీష్ సుచిత్ స్థానంలో) తిరిగి జట్టులోకి వచ్చాడు.
ఈ సీజన్ లో రెండు జట్లు తలపడుతుండటం ఇది రెండో సారి. ఐపీఎల్-15లో ఆడిన 7 మ్యాచులలో గుజరాత్ ఆరింటిలో గెలిచింది. అది ఓడిన ఒకే ఒక మ్యాచ్ మనతోనే. ఈనెల11న జరిగిన ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్.. 8 వికెట్లతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని గుజరాత్ రగిలిపోతున్నది.
ఇక సీజన్ లో వరుసగా రెండు మ్యాచులు ఓడి తర్వాత వరుసగా ఐదు మ్యాచులు నెగ్గిన సన్ రైజర్స్.. అదే ఊపును కొనసాగించాలని భావిస్తున్నది. గత మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ (68 కే ఆలౌట్) గుజరాత్ కు కూడా ఇవ్వాలని మన బౌలర్లు సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంటారు.
ప్రస్తుతం రాజస్తాన్ (8 మ్యాచులు 6 విజయాలు 2 ఓటములు.. 12 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్ (7 మ్యాచులు.. 6 విజయాలు.. 1 ఓటమి) రెండో స్థానంలో ఉండగా.. హైదరాబాద్ (7 మ్యాచులు.. 5 విజయాలు.. 2 ఓటములు.. 10 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది.
బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమాన బలాలతో ఉన్నాయి. బ్యాటింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్ లు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక మన బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది..? భువనేశ్వర్, మార్కో జాన్సేన్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ లు నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతున్నారు.
గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ లో ఓపెనర్లు కొంత తడబడుతున్నారు. అడపా దడపా తప్ప శుభమన్ గిల్ నుంచి ఇప్పటికీ అసలైన ఆటగాడు బయటకు రాలేదు. ఆ జట్టు ప్రధానంగా హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్ ల మీదే ఆధారపడుతున్నది. బౌలింగ్ లో షమీ, ఫెర్గూసన్ పేసర్లుగా రాణిస్తుండగా రషీద్ ఖాన్ స్పిన్ భారాన్ని మోస్తున్నాడు.
ముఖాముఖి : ఇరు జట్ల మధ్య ఇదే సీజన్ లో జరిగిన ఒక మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ నే విజయం వరించింది.
తుది జట్లు :
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్) అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్
సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సేన్, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
