TATA IPL 2022 RR vs DC: ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తకిర పోరు జరుగనున్నది. ప్లేఆఫ్స్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఢిల్లీ క్యాపిటల్స్ ది. రాజస్తాన్ రాయల్స్ కు కూడా ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మ్యాచుల కోసం వేచి చూడకుండా ఉండాలని భావిస్తున్నది.
ఐపీఎల్-15లో ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే తర్వాత ఆడబోయే మిగిలిన మూడు మ్యాచులను తప్పనిసరిగా నెగ్గాల్సిన పరిస్తితుల్లో ఢిల్లీ క్యాపిటల్స్ నేడు రాజస్తాన్ రాయల్స్ తో కీలక మ్యాచ్ లో తలపడుతున్నది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఢిల్లీ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. అలా కాకుండా ఫలితమేమైనా తేడాగా వస్తే మాత్రం అంతే సంగతులు. ఈ నేపథ్యంలో ముంబై లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ కీలక మ్యాచ్ లో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ బ్యాటిింగ్ చేయనుంది.
పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ 3వ స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో ప్లేస్ లో నిలిచింది. ఇరు జట్లు ఈ సీజన్ లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడాయి. అందులో రాజస్తాన్ 7 గెలిచి 4 ఓడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్ గెలిచినా ఆ జట్టు ప్లేఆఫ్స్ కు చేరే అవకాశముంది. ఇక ఢిల్లీ.. 5 మ్యాచుల్లో నెగ్గి 6 మ్యాచుల్లో ఓడింది. ప్లేఆఫ్స్ కు చేరాలంటే రాజస్తాన్ తో పాటు తర్వాత రెండు మ్యాచుల్లో కూడా పంత్ సేన నెగ్గి తీరాల్సిందే.
పడుతూ లేస్తూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ గత మ్యాచ్ లో చెన్నై చేతిలో దారుణంగా ఓడి చతికిలపడింది. అంతకుముందు సన్ రైజర్స్ తో మంచి విజయాన్ని అందుకున్నా దానిని చెన్నై మ్యాచ్ లో కొనసాగించలేకపోయింది. ఇక వరుసగా 2 మ్యాచులు ఓడిన రాజస్తాన్.. పంజాబ్ తో ముగిసిన తమ గత మ్యాచ్ లో గెలిచి తిరిగి విజయాల బాట పట్టింది.
బ్యాటింగ్, బౌలింగ్ లో రాజస్తాన్ పటిష్టంగా ఉంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ లతో పాటు పడిక్కల్, రియాన్ పరాగ్ లు ఆ జట్టు బ్యాటింగ్ ను మోస్తున్నారు. షిమ్రాన్ హెట్మెయర్ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేడు. అతడి స్థానంలో రస్సీ వన్ డర్ డసెన్ఆడుతున్నాడు. ఇక బౌలింగ్ లో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ లతో ఆ జట్టు పటిష్టంగా ఉంది.
ఢిల్లీ విషయానికొస్తే.. ఓ మ్యాచ్ లో అదరగొట్టిన ఆటగాళ్లు తర్వాత మ్యాచ్ లో తేలిపోతున్నారు. సీజన్ ఆసాంతం ఆ జట్టు పరిస్థితి ఇదే. మరి కీలక మ్యాచ్ లో డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, మిచెల్ మార్ష్, రొవ్మెన్ పావెల్ లతో కూడిన బ్యాటర్లు ఏ మేరకు మెరుపులు మెరిపిస్తారో చూడాలి. బౌలింగ్ లో అన్రిచ్ నోర్త్జ్ తిరిగి ఫామ్ అందుకున్నాడు. కానీ శార్దూల్ ఠాకూర్ దారుణంగా విఫలమవుతున్నాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు ప్రత్యర్థిని బాగానే కట్టడి చేస్తున్నారు. ఢిల్లీ జట్టులో రిపల్ పటేల్, ఖలీల్ అహ్మద్ స్థానంలో లలిత్ యాదవ్, చేతన్ సకారియా ఆడుతున్నారు.
ముఖాముఖి : ఇరుజట్ల మధ్య 25 మ్యాచులు జరగగా.. 13 విజయాలతో రాజస్తాన్ ఆధిపత్యంలో ఉంది. 12 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. గడిచిన 9 మ్యాచులలో 6 మ్యాచుల్లో ఢిల్లీ దే విజయమైనా ఈ సీజన్ లో కొద్దిరోజుల క్రితం ముగిసిన మ్యాచ్ లో రాజస్తాన్.. 15 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే.
తుది జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, శ్రీకర్ భరత్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), రొవ్మెన్ పావెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, అన్రిచ్ నోర్త్జ్
రాజస్తాన్ రాయల్స్ : జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రస్సీ వన్ డర్ డసెన్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్
