TATA IPL 2022 GT vs SRH: వరుస విజయాలతో జోరు మీదున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రధాన ఆయుధం బౌలింగ్ అనేది ఆ జట్టు అభిమానులను ఎవర్నడిగినా చెప్తారు. కానీ గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో మాత్రం మన బ్యాటింగ్ కూడా అదిరిపోయింది. 20 ఓవర్లలో హైదరాబాద్ 195 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రధాన ఆయుధం బౌలింగ్. ప్రస్తుతం ఉన్న జట్టులో కేన్ విలియమ్సన్ మినహా పేరు మోసిన బ్యాటర్లు పెద్దగా లేరు. గత మ్యాచులలో కేన్ మామ టాస్ గెలిచి ప్రత్యర్థులను బౌలింగ్ తో కొట్టి తర్వాత బ్యాటింగ్ లో తక్కువ స్కోరును అవలీలగా ఛేదించాడు. కానీ తాజాగా గుజరాత్ తో మ్యాచ్ లో సీన్ రివర్స్. టాస్ ఓడిన సన్ రైజర్స్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కేన్ మామ, రాహుల్ త్రిపాఠి త్వరగానే ఔటయ్యారు. కానీ అప్పుడే మొదలైంది అసలు తుఫాను.
సోషల్ మీడియాలో అభిమానులు ఇష్టంగా పిలుచుకుంటున్న అంబర్ పేట్ అభి (అభిషేక్ శర్మ) (42 బంతుల్లో 65.. 6 ఫోర్లు, 3 సిక్సర్లు), మలక్ పేట మార్క్రమ్ (40 బంతుల్లో 56.. 2 ఫోర్లు, 3 సిక్సర్లు) లు టాప్ లేపే ప్రదర్శన తో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీళ్లిద్దరి టాప్ క్లాస్ ఆటతో పాటు ఆఖర్లో శశాంక్ సింగ్ (25 నాటౌట్) మెరుపులు తోడవడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు మూడో ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. అతడు వేసిన ఆ ఓవర్లో కేన్ విలియమ్సన్ (5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన రాహుల్ త్రిపాఠి (10 బంతుల్లో 16.. 2 ఫోర్లు, 1 సిక్సర్) రెండు ఫోర్లు కొట్టినా షమీ వేసిన5 ఓవర్ ఆఖరి బంతికి ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో ఐదు ఓవర్లకే సన్ రైజర్స్ 44 పరుగులు చేసి రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఇక ఆ క్రమంలో క్రీజులోకి వచ్చిన మార్క్రమ్ తో కలిసి అభిషేక్ చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదిన ఈ ఇద్దరూ.. మంచి బంతులను గౌరవిస్తూ వికెట్ ను కాపాడుకున్నారు. 11 ఓవర్ దాకా పెద్దగా మెరుపులేమీ లేవు. కానీ అల్జారీ జోసెఫ్ వేసిన అదే ఓవర్లో ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన మార్క్రమ్ స్కోరు వేగాన్ని పెంచాడు. అదే ఊపులో అభిషేక్ కూడా రషీద్ ఖాన్ వేసిన 12 వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో ఎస్ఆర్హెచ్ స్కోరు 100 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే అతడు కూడా 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఫెర్గూసన్ వేసిన 15వ ఓవర్లో సిక్సర్ బాదిన మార్క్రమ్.. రషీద్ ఖాన్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు బౌండరీలు బాదాడు. అయితే అల్జారీ జోసెఫ్ 16వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన అభిషేక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 96 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అభిషేక్ స్థానంలో క్రీజులోకి వచ్చిన పూరన్ (3) ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు. అతడిని కూడా షమీనే 17వ ఓవర్లో ఔట్ చేశాడు. అదే ఓవర్లో ఐదో బంతికి సిక్సర్ కొట్టిన మార్క్రమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
అయితే యశ్ దయాల్ వేసిన 18వ ఓవర్లో అతడు మిల్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ వెంటనే హైదరాబాద్.. వాషింగ్టన్ సుందర్ (3) వికెట్ ను కూడా కోల్పోయింది. ఆఖర్లో.. శశాంక్ సింగ్ (6 బంతుల్లో 25 నాటౌట్.. 1 ఫోర్, 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేయగలిగింది.
గుజరాత్ బౌలర్లలో షమీకి 3 వికెట్లు దక్కాయి. యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్ కు తలా ఒక వికెట్ దక్కింది. రషీద్ ఖాన్ భారీగా పరుగులిచ్చుకున్నాడు.
