దేశవాళీ టీ20 లీగ్ సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. 31 జనవరి ఆదివారం, తమిళనాడు, బరోడా మధ్య ఫైనల్ ఫైట్ జరగనుంది. రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ జట్టును ఓడించిన బరోడా, ఫైనల్‌ చేరింది. టాస్ గెలిచిన పంజాబ్, బరోడా జట్టుకి బ్యాటింగ్ అప్పగించింది.

మొదట బ్యాటింగ్ చేసిన బరోడా 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. బరోడా కెప్టెన్ దేవ్‌ధర్ 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేయగా కార్తీక్ కకడే 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. లక్ష్యచేధనలో పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది.

గురుకీరట్ సింగ్ మాన్ 37 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేయగా కెప్టెన్ మన్‌దీప్ సింగ్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో తమిళనాడు, బరోడా జట్ల మధ్య ఆదివారం రాత్రి 7 గంటలకు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు కూడా ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ చేరడం విశేషం.