తమిళనాడు జట్టు సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. రాజస్థాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకున్న దినేశ్ కార్తీక్ జట్టు... 2021 సీజన్‌లో మొదటి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.

టాస్ గెలిచిన రాజస్థాన్, మొదట బ్యాటింగ్ ఎంచుకుని, 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. రాజస్థాన్ కెప్టెన్ మెనారియా 51 పరుగులు చేయగా, ఏ గుప్తా 45 పరుగులు చేశాడు. తమిళనాడు బౌలర్ మహ్మద్‌కి 4 వికెట్లు దక్కగా, సాయి కిషోర్ 2 వికెట్లు తీశాడు.

155 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి చేధించింది తమిళనాడు. ఎన్ జగదీశన్ 28 పరుగులు చేయగా అరుణ్ కార్తీక్ 54 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు, కెప్టెన్ దినేశ్ కార్తీక్ 17 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో సెమీస్ మ్యాచ్‌లో పంజాబ్, బరోడా జట్ల మధ్య ఫైనల్ బెర్త్ కోసం పోటీ జరగనుంది.