ఐపీఎల్ మ్యాచ్‌లలో చీర్‌లీడర్లుగా యువతులు డ్యాన్స్ చేస్తారని, స్టేడియాల్లోనూ మహిళా వీక్షకులు ఉంటారని పేర్కొంటూ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేయవద్దని నిషేధించింది. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు మహిళలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఐపీఎల్ సీజన్‌ను ఆసక్తిగా తిలకిస్తారు. ఐపీఎల్‌కు విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్నది. కానీ, ఈ మ్యాచ్‌లను ప్రసారం చేయకూడదని తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు తాలిబాన్ ప్రభుత్వం పేర్కొన్న కొన్ని వింత కారణాలను ఆ దేశ జర్నలిస్టు వెల్లడించారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఐపీఎల్ ప్రసారాలను తాలిబాన్ నిషేధించిందని వివరించిన ఆయన అందుకు కొన్ని కారణాలు వివరించారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో యువతులు డ్యాన్స్ చేస్తారని, స్టేడియాలలో మహిళా వీక్షకులూ ఉంటారనే కారణాన్ని పేర్కొంటూ తాలిబాన్ ఈ నిషేధాన్ని విధించినట్టు తెలిపారు. చీర్ లీడర్ల హంగామా కారణంగా దేశవ్యాప్తంగా మ్యాచ్ ప్రసారాలనే నిషేధించడం ఇదే తొలిసారి.

Scroll to load tweet…

తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల క్రీడలను మహిళలకు దూరం చేశారు. అయితే, పురుషులు క్రికెట్ ఆడవచ్చని స్పష్టం చేసింది. మహిళలు ఇంటికే పరిమితమవ్వాలని, ఉద్యోగాలనూ వదిలిపెట్టాలని హుకూం జారీ చేసింది. పురుషుల తోడు లేకుండా ఇంటి గడప దాటవద్దని, స్టేడియంలోకీ వారి ప్రవేశాలను నిషేధించినట్టు వార్తలు వచ్చాయి. మహిళా క్రికెట్‌ను తాలిబాన్లు నిషేధించారన్న వార్తలు నిజమైతే తమ దేశంలో ప్రతిపాదించిన ఆఫ్ఘనిస్తాన్ పురుషుల క్రికెట్ మ్యాచ్‌లను నిలిపేస్తామని ఆస్ట్రేలియా హెచ్చరించింది.

ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లు యూఏఈలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగ్గా, తర్వాతి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మద్య జరిగింది.