Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021: హ్యాట్రిక్ విజయాలతో ముగించిన టీమిండియా... నమీబియాపై ఆడుతూ పాడుతూ...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో వరుసగా మూడో విజయం అందుకున్న టీమిండియా... 15.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి సునాయాస విజయం...

T20 Worldcup 2021: Team India beats Namibia, and Virat Kohli closes his t20 captaincy with Win
Author
India, First Published Nov 8, 2021, 10:29 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీని టీమిండియా వరుసగా హ్యాట్రిక్ విజయాలతో ముగించింది. సూపర్ 12 రౌండ్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో నమీబియా విధించిన 133 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు భారత బ్యాట్స్‌మెన్. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరి మధ్య ఇది 11వ 50+ భాగస్వామ్యం.

రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ కలిసి 11 సార్లు 50+ భాగస్వామ్యం నెలకొల్పగా, కెఎల్ రాహుల్, రోహిత్ జోడీ ఈ రికార్డును సమం చేశారు. ఈ దశలో రోహిత్ శర్మ 3 వేల టీ20 పరుగులను పూర్తి చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ, మార్టిన్ గుప్టిల్ తర్వాత 3వేల టీ20 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో 3వేలకు పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ. 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసిన రోహిత్ శర్మ, జాన్ ఫ్రైలిక్ బౌలింగ్‌లో కీపర్ జేన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు కెఎల్ రాహుల్. సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 4 ఫోర్లతో పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగలిగింది. స్టీఫన్ బార్డ్, మైకెల్ వాన్ లింగెన్ కలిసి 4.3 ఓవర్లలోనే 33 పరుగుల భాగస్వామ్యం జోడించి శుభారంభం అందించారు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన మైకెల్ వాన్ లింగెన్‌, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో మహ్మద్ షమీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...


ఆ తర్వాత క్రెగ్ విలియమ్స్ 4 బంతులాడి డకౌట్ అయ్యాడు. జడ్డూ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు క్రెగ్ విలియమ్స్ ముందుగా రాగా, బంతికి అందుకున్న రిషబ్ పంత్ స్టంపౌట్ చేశాడు. 21 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసిన స్టీఫన్ బార్డ్‌ కూడా రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..

గ్రెహర్డ్ ఎరాస్మస్ 20 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, 5 పరుగులు చేసిన జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్ కూడా అశ్విన్ బౌలింగ్‌లోనే రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

జేజే స్మిత్ 9 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, జేన్ గ్రీన్‌ని మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. 25 బంతుల్లో 2 ఫోర్లతో 26 పరుగులు చేసిన డేవిడ్ వీస్, జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి రోహిత్ శర్మకి క్యాచ్ ిచ్చి అవుట్ అయ్యాడు...

గత మ్యాచ్‌లో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన జడేజా, నేటి మ్యాచ్‌లో 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజాకి టీ20ల్లో ఈ రెండు అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. అలాగే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మూడుసార్లు మూడేసి వికెట్లు తీసిన బౌలర్లుగా బాలాజీతో పాటు సమంగా నిలిచారు జడేజా, అశ్విన్...

టీ20 వరల్డ్ కప్ టోర్నీ కెరీర్‌లో 25 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఓవరాల్‌గా అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. షకీబుల్ హసన్ 41, షాహీద్ ఆఫ్రిదీ 39, సయ్యిద్ అజ్మల్ 35, అజంతా మెండీస్ 35 వికెట్లు తీశారు. అయితే టాప్ 5లో ఉన్న వారిలో బెస్ట్ ఎకానమీ ఉన్న బౌలర్‌ నిలిచిన అశ్విన్, యావరేజ్‌లో రెండో స్థానంలో ఉండడం విశేషం.

జస్ప్రిత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా మహ్మద్ షమీ తన నాలుగు ఓవర్లలో వికెట్ తీయలేకపోగా 39 పరుగులు సమర్పించాడు. భారత బౌలర్ల ఎక్స్‌ట్రాల రూపంలో 17 పరుగులు సమర్పించడం విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios