T20 Worldcup 2021: 68 పరుగులు చేసిన చరిత్ అసలంక...రెండు వికెట్లు తీసిన ఆండ్రే రస్సెల్... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న శ్రీలంక, డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లంక జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది...

శ్రీలంక ఓపెనర్లు కుశాల్ పెరేరా, పథుమ్ నిశ్శంక కలిసి మొదటి వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసిన కుశాల్ పెరేరా, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

ఆ తర్వాత పథుమ్ నిశ్శంక, చరిత్ అసలంక కలిసి రెండో వికెట్‌కి 91 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 41 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు చేసిన ఓపెనర్ పథుమ్ నిశ్శంక 51 పరుగులు చేసి బ్రావో బౌలింగ్‌లో హట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

Read also: అక్కడ హీరో, ఇక్కడ విలన్... టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అంటే వారికి ఎందుకు పడదు...

చరిత్ అసలంక, కెప్టెన్ దసున్ శనక కలిసి మూడో వికెట్‌కి 66 పరుగుల భాగస్వామ్యం అందించారు. 41 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసిన చరిత్ అసలంక, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి, హెట్మయర్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు...

వెస్టిండీస్ బౌలర్లు జాసన్ హోల్డర్ వేసిన 17వ ఓవర్‌లో 16 పరుగులు, ఆ తర్వాత డ్వేన్ బ్రావో వేసిన 18వ ఓవర్‌లో 17 పరుగులు రాబట్టారు లంక బ్యాట్స్‌మెన్... కెప్టెన్ దసున్ శనక 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా, చరిత్ కరుణరత్నే 3 బంతుల్లో 3 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఇది మూడో అత్యధిక స్కోరు. ఇంతకుముందు ఇండియా, ఆఫ్ఘాన్‌పై 210 పరుగుల స్కోరు చేయగా, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 190 పరుగులు చేసింది. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో 231 పరుగులు పూర్తి చేసుకున్న చరిత్ అసలంక, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచాడు. లంక ఓపెనర్ పథుమ్ నిశ్శంక 221 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, జోస్ బట్లర్ 214, పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 199 పరుగులతో టాప్ 4 ఉండగా, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 198 పరుగులు చేసి టాప్ 5లో ఉన్నాడు. 

Read this: రాహుల్ ద్రావిడ్‌కి ఆ విషయం అస్సలు చెప్పకండి... బీసీసీఐకి అజయ్ జడేజా రిక్వెస్ట్...

సూపర్ 12 రౌండ్‌లో నాలుగు మ్యాచులు ఆడి ఒకే ఒక్క విజయం అందుకున్న శ్రీలంక, ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. వెస్టిండీస్ మూడు మ్యాచుల్లో ఓ విజయం అందుకోని, రెండు మ్యాచుల్లో ఓడింది. విండీస్ ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే నేటి మ్యాచ్‌లో భారీ విజయం అందుకోవాల్సిందే... నేటి మ్యాచ్‌లో ఓడితే రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన వెస్టిండీస్, ప్లేఆఫ్స్ రేసు నుంచి కూడా అధికారికంగా తప్పుకుంటుంది...

గ్రూప్ 1లో ఇంగ్లాండ్ వరుసగా నాలుగు విజయాలతో టాప్‌లో ఉండగా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మూడు విజయాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.