Asianet News TeluguAsianet News Telugu

కావాలంటే ఫిజియోను పంపిస్తామన్న అశ్విన్... తెలుగులో రిప్లై చేసిన ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్...

T20 worldcup 2021: అవసరమైతే ముజీబ్ ఫిట్‌నెస్ కోసం ఫిజియోను పంపిస్తామన్న రవిచంద్రన్ అశ్విన్... తెలుగులో రిప్లై ఇచ్చిన రషీద్ ఖాన్...

T20 Worldcup 2021: Rashid khan responds in Telugu after Ravichandran Ashwin comments on Mujeeb
Author
India, First Published Nov 5, 2021, 3:31 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఫెవరెట్‌గా బరిలో దిగిన జట్లలో ఆప్ఘనిస్తాన్ ఒకటి. యూఏఈలో వరుసగా 15 మ్యాచుల్లో గెలిచిన ఆఫ్ఘాన్, సంచలనం నమోదుచేస్తుందని, ప్లేఆఫ్స్ చేరుతుందని అంచనా వేశారు క్రికెట్ విశ్లేషకులు. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది ఆఫ్ఘాన్.

అయితే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఆఫ్ఘాన్, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నలో ఆడిన ఆడిన 2 మ్యాచుల్లో 6 వికెట్లు తీసిన ముజీబ్ వుర్ రహ్మాన్, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు...


అయితే గాయం కారణంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ముజీబ్ బరిలో దిగలేదు. దీంతో ఆ వీక్‌నెస్‌ను బాగా వాడుకున్న టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 210 పరుగుల భారీ స్కోరు చేసిన విషయం తెలిసిందే... ఆఫ్ఘానిస్తాన్, టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ముజీబ్ ఆడకపోవడంతో భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్ చేశాడు.

‘అదో ఫన్నీ గేమ్. ఆఫ్ఘనిస్తాన్ బాగా ఆడింది. మేం ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఆఫ్ఘాన్, న్యూజిలాండ్‌ని ఓడించాలి. వాళ్లకి ఆల్ ది బెస్ట్. కావాలంటే మేం ముజీబ్ ఫిట్‌గా ఉండేందుకు ఫిజియో అవసరం కావాలంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాగైనా అతన్ని ఆడించాలి. ఇప్పడు మా ఆశలు వారిపైనే...’అంటూ కామెంట్ చేశాడు అశ్విన్...

అశ్విన్ కామెంట్లపై రషీద్ ఖాన్ స్పందించాడు. ‘భాయ్... మీరు భయపడకండి. మా టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడ ‘చూసుకుంటున్నారు...’ అంటూ తెలుగులో ట్వీట్ చేశాడు రషీద్... ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ తెలుగు కామెంట్‌కి పగలబడి నవ్వుతున్నట్టుగా రిప్లై ఇచ్చాడు అశ్విన్. 

ఆఫ్ఘానిస్తాన్ టీమ్‌కి ఫిజియోగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ మన తెలుగువాడే. రవిచంద్రన్ అశ్విన్ తమిళుడు అయినా తెలుగువాడని భావించిన రషీద్ ఖాన్, ఇలా తెలుగులో రిప్లై ఇచ్చి ఉంటాడని అనుకుంటున్నారు అభిమానులు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున ఆడే రషీద్ ఖాన్, ఆరెంజ్ ఆర్మీ బ్యాటింగ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ దగ్గర కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకున్నాడట. 

మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా, ప్లేఆఫ్స్ రేసులో నిలవాలటే స్కాట్లాండ్, నమీబియాలపై భారీ తేడాతో విజయాలు అందుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టు, న్యూజిలాండ్‌ను కనీసం 9 పరుగుల తేడాతో ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్, టీమిండియా రెండూ రెండేసి పరాజయాలతో సమంగా ఉంటాయి.

అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ చేరే జట్టును నిర్ణయించాల్సి ఉంటుంది. ఆఫ్ఘాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 పరుగులు, అంతకంటే ఎక్కువ పరుగల తేడాతో ఓడితే టీమిండియాకి అవకాశాలు పెరుగుతాయి. అయితే స్కాట్లాండ్, నమీబియాతో జరిగే మ్యాచుల్లో 56+ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది టీమిండియా...

Follow Us:
Download App:
  • android
  • ios