India vs Pakistan: 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న పాకిస్తాన్... ఐసీసీ వరల్డ్‌కప్ ట్రోఫీల్లో భారత్‌పై తొలి విజయం...

ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటిదాకా పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోని, టీమిండియా ఆధిపత్యానికి ఎట్టకేలకు తెర పడింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఐదు విజయాల తర్వాత పాక్ చేతుల్లో తొలి ఓటమి ఎదుర్కొంది భారత జట్టు. అది కూడా కనీస పోరాటం కూడా లేకుండా, ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయకుండా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది భారత జట్టు...

టీమిండియా విధించిన 152 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్ జట్టు ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. బౌలర్ ఎవరనేది చూడకుండా, ఫీల్డర్ ఎక్కడెక్కడున్నారో కరెక్టుగా తెలిసినట్టుగా, ఏ బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలో రీసెర్చ్ చేసి మరీ తెలుసుకుని వచ్చినట్టుగా బ్యాటింగ్ కొనసాగించారు బాబర్, రిజ్వాన్...


టీమిండియా ఫీల్డర్లకు, బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగించి అజేయంగా 152 పరుగుల భారీ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు.. టీమిండియాపై ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2012లో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ కలిసి తొలి వికెట్‌కి నెలకొల్పిన 133 రికార్డును అధిగమించారు రిజ్వాన్, బాబర్ ఆజమ్...

మహ్మద్ రిజ్వాన్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేయగా, బాబర్ ఆజమ్ 52 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అంతకుముందు టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. రోహిత్ శర్మ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా, బీభత్సమైన ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్‌ను కూడా షాహీన్ ఆఫ్రిదీ క్లీన్‌బౌల్డ్ చేశాడు.

8 బంతుల్లో 3 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, మూడో ఓవర్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 8 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 11 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, హసన్ ఆలీ బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 5.4 ఓవర్లలోనే 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా...

సూర్యకుమార్ యాదవ్ వికెట్‌తో టీ20ల్లో 100 క్యాచులు పూర్తిచేసుకున్నాడు పాకిస్తాన్ వికెట్ కీపర్ రిజ్వాన్... పవర్ ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేయగలిగింది భారత జట్టు...
రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ కలిసి నాలగో వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆదుకునే ప్రయత్నిం చేశారు. 30 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసిన రిషబ్ పంత్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..


పాకిస్తాన్‌పై ఐసీసీ టోర్నీల్లో 500+ పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ... 45 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో 10వ అర్ధశతకం నమోదుచేశాడు. క్రిస్ గేల్ 9 హాఫ్ సెంచరీలను అధిగమించిన విరాట్, అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, హసన్ ఆలీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్ కూడా విరాట్ కోహ్లీ. గత ఆరు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ, ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు... 49 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో కీపర్ రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. మూడు వికెట్లు, టీమిండియాని కట్టడి చేసిన అఫ్రిదీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.