Asianet News TeluguAsianet News Telugu

వ్యాక్సిన్ వేసుకున్నారా, అయితే మ్యాచ్ చూద్దాం వచ్చేయండి... జైపూర్‌లో జరిగే మొదటి టీ20 మ్యాచ్‌కి...

నవంబర్ 17న జైపూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్... పూర్తిగా, పాక్షికంగా వ్యాక్సిన్ కోర్సు పూర్తిచేసుకున్నవారికి అనుమతి...

T20 Worldcup 2021: Jaipur Stadium allowing 100 Percent Crowd for First T20I between India vs New Zealand
Author
India, First Published Nov 11, 2021, 8:29 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌కే పరిమితమైంది. ఇప్పటికే స్వదేశానికి చేరుకున్న టీమిండియా, న్యూ.జిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతోంది. టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీ మొదటి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి, ఫైనల్‌కి చేరుకుంది న్యూజిలాండ్ టీమ్. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కివీస్ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 

2015 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్, 2019 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఫైనల్‌ చేరింది. ఈ రెండు టోర్నీల్లోనూ తుది పోరులో ఓడి, రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్, ఈ ఏడాది జూన్‌లో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గింది. వరుసగా న్యూజిలాండ్‌కి ఇది మూడో ఐసీసీ టైటిల్ ఫైనల్...

నవంబర్ 14న ఫైనల్ ఆడే న్యూజిలాండ్, ఆ తర్వాత మూడు రోజులకు నవంబర్ 17న జైపూర్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ జరిగే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం (ఎస్‌ఎమ్‌ఎస్), పూర్తి స్థాయి కెపాసిటీతో జనాలను స్టేడియానికి అనుమతించనుంది. 

కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ ప్రేక్షకులు లేకుండా యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన టీ20 సిరీస్‌కి 50 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతించారు. ఆ తర్వాత సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌ ఫస్టాఫ్ కూడా ఖాళీ స్టేడియాల్లో జరిగింది. 

పరిస్థితి కాస్త కుదురుకోవడంతో యూఏఈలో జరిగిన ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ మ్యాచ్‌లకు 60 శాతం కెపాసిటీతో జనాలను అనుమతించారు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీ మ్యాచులకు కూడా ఇదే పరిస్థితి. దాదాపు 60 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతిస్తున్నా, పాకిస్తాన్ ఆడే మ్యాచులకు తప్ప మిగిలిన మ్యాచు‌లకు జనాల నుంచి ఆ రేంజ్‌లో స్పందన రావడం లేదు.

జైపూర్‌లో జరిగే మొదటి టీ20 మ్యాచ్‌కి పూర్తి కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి స్టేడియంలోకి అనుమతించాలని భావిస్తున్నారు నిర్వహకులు...

Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...

‘రాజస్థాన్‌లో పరిస్థితులు రోజురోజుకీ మెరుగవుతున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయి కెపాసిటీతో మ్యాచ్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరడం కూడా జరిగింది. స్టేడియానిక వచ్చేవారందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అలాగే స్టేడియంలోకి వచ్చేవారందరూ రెండో డోస్‌ల వ్యాక్సిన్ కోర్సు పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ ఒకే డోస్ వేసుకుంటే, కరోనా నెగిటివ్ రిపోర్టు (రెండు రోజులలోపు తీసినది) తీసుకుని స్టేడియానికి రావాల్సి ఉంటుంది...’ అంటూ తెలియచేశారు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మహేంద్ర శర్మ...

విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్ శర్మ పూర్తి స్థాయి టీమిండియా టీ20 కెప్టెన్‌గా జైపూర్ టీ20 నుంచే బాధ్యతలు చేపట్టబోతున్నాడు. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్‌, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, వ్రేయాస్ అయ్యర్, యజ్వేంద్ర చాహాల్ వంటి సీనియర్లతో పాటు వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ వంటి కొత్త ప్లేయర్లకు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అవకాశం దక్కింది.

Read Also: త్వరలో టీ20లకు విరాట్ కోహ్లీ గుడ్‌బై, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ... టీమిండియా కెప్టెన్‌పై పాక్ మాజీల...

Follow Us:
Download App:
  • android
  • ios