Asianet News TeluguAsianet News Telugu

T20 Worldcup 2021: ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా... పాకిస్తాన్ వరుస విజయాలకు బ్రేక్ వేసిన ఆసీస్...

Pakistan vs Australia: 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా... యూఏఈలో పాకిస్తాన్ 15 వరుస విజయాలకు బ్రేక్...

T20 Worldcup 2021: Australia Beats Pakistan and Reaches final of the T20 Worldcup 2021 trophy
Author
India, First Published Nov 11, 2021, 11:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 వరల్డ్‌కప్ 2021 సూపర్ 12 రౌండ్‌లో వరుసగా ఐదు విజయాలతో దుమ్ముదులిపిన పాకిస్తాన్, సెమీ ఫైనల్‌‌లో ఆసీస్ చేతుల్లో బోల్తా పడింది. 176 పరుగుల భారీ స్కోరు చేసినా, దాని కాపాడుకోలేక 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది పాక్. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ చేరడంతో ఈసారి కొత్త విజేతను చూసే అవకాశం దక్కనుంది. 177 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకి ఇన్నింగ్స్ మూడో బంతికే ఊహించని షాక్ తగిలింది. షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు కెప్టెన్ ఆరోన్ ఫించ్. మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే రాగా, 3 ఓవర్లు ముగిసేసరికి 13 పరుగులు మాత్రమే చేయగలిగింది ఆసీస్.

అయితే ఇమాద్ వసీం వేసిన నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టాడు డేవిడ్ వార్నర్. మిచెల్ మార్ష్ కూడా దూకుడు పెంచడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి 52 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.. అయితే 22 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, షాదబ్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో 51 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది.

టూ డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ ఆరు బంతులాడి 5 పరుగులు మాత్రమే చేసి షాదబ్ ఖాన్ బౌలింగ్‌లోనే ఫకార్ జమాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు... ఆ తర్వాత మూడో తన మూడో ఓవర్‌ మొదటి బంతికి డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేశాడు షాదబ్ ఖాన్. 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రిజ్వాన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే టీవీ రిప్లైలో డేవిడ్ వార్నర్ బ్యాటుకి బంతి తగలనట్టు చూపించింది. 

Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...

 బ్యాటుకి బంతికీ మధ్య చాలా గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తున్నప్పుడు, బ్యాటుకి బంతి తగలలేదని వార్నర్‌కి తెలిసినప్పడు రివ్యూ ఎందుకు తీసుకోలేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మ్యాక్స్‌వెల్ 10 బంతుల్లో 7 పరుగులు చేసి షాదబ్ ఖాన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. 42 బంతుల్లో 74 పరుగులు కావాల్సిన దశలో రెండు ఓవర్లలో ఆరేసి పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఆఖరి ఐదు ఓవర్లలో 62 పరుగులు కావాల్సి వచ్చింది...

హసన్ ఆలీ వేసిన 16వ ఓవర్‌లో 12 పరుగులు రాగా, హరీస్ రౌఫ్ వేసిన 17వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. హసన్ ఆలీ వేసిన 18వ ఓవర్‌లో 15 పరుగులు రావడంతో ఆఖరి రెండు ఓవర్లలో 22 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది ఆసీస్... షాహీన్ ఆఫ్రిదీ వేసిన 19వ ఓవర్‌‌లో హసన్ ఆలీ క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన  మాథ్యూ వేడ్, వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాది, మ్యాచ్‌ను ముగించాడు మాథ్యూ వేడ్. 

స్టోయినిస్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేయగా, మాథ్యూ వేడ్ 17 బంతల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 41 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఆదివారం నవంబర్ 14న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లూ ఇప్పటిదాకా టీ20 వరల్డ్‌ కప్ టైటిల్ గెలవకపోవడంతో ఈసారి కొత్త విన్నర్‌ని చూసే అవకాశం దక్కనుంది.

Read Also: ఏంటీ ఫీల్డింగ్! ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారా... పాకిస్తాన్‌ని ట్రోల్ చేస్తున్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్...

నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చిన షాదబ్ ఖాన్, నాలుగు వికెట్లు పడగొట్టాడు. 2012లో వెస్టిండీస్‌పై నాలుగు వికెట్లు తీసిన అజంతా మెండీస్ తర్వాత టీ20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచుల్లో నాలుగు వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు షాదబ్ ఖాన్.

అంతకుముందు  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి మరోసారి పాకిస్తాన్‌కి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 71 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఈ ఇద్దరూ 400+ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం..

34 బంతుల్లో 5 ఫోర్లతో 39 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఇన్నింగ్స్ మొదటి బంతికే రిజ్వాన్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్‌తో పాటు ఆసీస్ ప్లేయర్లు క్యాచులు వదిలేయడంతో బాబర్ ఆజమ్, రిజ్వాన్‌లకు అవకాశాలు వచ్చినట్టైంది. 

ఆసిఫ్ ఆలీ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించి, స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికి ఫకార్ జమాన్ ఇచ్చిన క్యాచ్‌ను స్మిత్ జారవిడిచాడు. 20వ ఓవర్ రెండో బంతికి షోయబ్ మాలిక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు మిచెల్ స్టార్క్. 

ఆసీస్ ఫీల్డర్లు ఇచ్చిన ఛాన్సులను చక్కగా వాడుకున్న ఫకార్ జమాన్, ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ఫకార్ జమాన్. 

Follow Us:
Download App:
  • android
  • ios