కీలక పోరులో విండీస్‌దే విజయం.. జింబాబ్వేపై ఈజీ విక్టరీతో సూపర్-12 ఆశలు సజీవం
T20 World Cup 2022: రెండు సార్లు ఛాంపియన్ అన్న ట్యాగ్ ఉండి కూడా ఈసారి ప్రపంచకప్ లో క్వాలిఫై మ్యాచ్ లు ఆడుతున్న వెస్టిండీస్.. టోర్నీలో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో రాణించి సూపర్ విక్టరీ కొట్టింది. జింబాబ్వేను ఓడించి సూపర్-12 ఆశలు నిలుపుకుంది.
ప్రపంచకప్ లో ఆడటానికి అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో కరేబియన్ ఆటగాళ్లు జూలు విదిల్చారు. బ్యాటింగ్, బౌలింగ్ లలో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్.. తాజాగా జింబాబ్వేను ఓడించి సూపర్-12 ఆశలు సజీవంగా నిలుపుకుంది. జింబాబ్వేతో హోబర్ట్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో వెస్టిండీస్.. 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.
హోబర్ట్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో టాస్ గెలిచిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ చార్లెస్ (36 బంతుల్లో 45, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రొవ్మన్ పావెల్ (21 బంతుల్లో 28, 1 ఫోర్, 2 సిక్సర్లు), అకీల్ హోసేన్ (18 బంతుల్లో 23, 2 ఫోర్లు) రాణించారు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రాజా 3 వికెట్లు తీయగా ముజర్బానీ రెండు, సీన్ విలియమ్స్ ఒక వికెట్ తీశాడు.
మెస్తారు లక్ష్య ఛేదనలో జింబాబ్వే.. 18.2 ఓవర్లలో 122 కే పరిమితమైంది. ఆ జట్టు లక్ష్యం దిశగా సాగినట్టు అనిపించలేదు. ఓపెనర్ వెస్లీ మదేవెర్ (19 బంతుల్లో 27, 3 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. మిగిలినవారిలో కెప్టెన్ రెగిస్ చకబ్వా (13), టాన్ మున్యోంగ (2), సీన్ విలియమ్స్ (1), మిల్టన్ శుబ్మా (2), సికందర్ రాజా (14) విఫలమయ్యారు. 13.3 ఓవర్లలో 92 పరుగులకే ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ సయమంలో లూక్ జాంగ్వే (22 బంతుల్లో 29, 3 ఫోర్లు, 1 సిక్సర్) కాస్త ప్రతిఘటించాడు. కానీ అల్జారీ జోసెఫ్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. చతర (3) ను జేసన్ హోల్డర్ క్లీన్ బౌల్డ్ చేయడంతో జింబాబ్వే ఇన్నింగ్స్.. 18.2 ఓవర్లలో 122 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా విండీస్, 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ నాలుగు వికెట్లు తీయగా.. జేసన్ హోల్డర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఒబెడ్ మెక్ కాయ్, ఒడియన్ స్మిత్ కు తలా ఒక వికెట్ దక్కింది.
ఈ విజయంతో విండీస్.. సూపర్-12 రేసులో నిలిచింది. గ్రూప్-బీలో ఉన్న విండీస్ తో పాటు స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వేలు తలా రెండు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్ ను ఓడాయి. ఇప్పుడు నాలుగు జట్లు తమ తదుపరి మ్యాచ్ లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాప్-2లో ఉన్న జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి.