టీ20 ఛాంపియన్ విండీస్‌కి దిమ్మతిరిగే షాక్... ఐర్లాండ్ చేతుల్లో ఓడి తొలి రౌండ్ నుంచే అవుట్..
టీ20 వరల్డ్ కప్ 2022: ఐర్లాండ్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన వెస్టిండీస్... క్వాలిఫైయర్స్‌లో రెండు మ్యాచుల్లో ఓడి, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్...
రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ వెస్టిండీస్‌కి ఊహించని షాక్ ఇచ్చింది పసికూన ఐర్లాండ్. తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్ చేతుల్లో ఓడిన విండీస్, తాజాగా మ్యాచ్‌లో ఓడి తొలి రౌండ్ నుంచి నిష్కమించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగి, గత సీజన్‌లో సూపర్ 12 రౌండ్‌లో నిష్కమించిన విండీస్, ఈసారి క్వాలిఫైయర్ రౌండ్ కూడా దాటకపోవడం విశేషం...
పసికూన ఐర్లాండ్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది వెస్టిండీస్. సీనియర్లు లేకుండా టీ20 వరల్డ్ కప్ 2022 బరిలో దిగిన విండీస్, భారీ మూల్యం చెల్లించుకుంది.
147 పరుగుల లక్ష్యఛేదనలో ఐర్లాండ్‌కి అదిరిపోయే ఆరంభం అందించారు ఓపెనర్లు. పాల్ స్టిర్లింగ్, కెప్టెన్ ఆండ్రూ బాల్బీరిన్ కలిసి తొలి వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం జోడించారు. మొదటి ఓవర్ నుంచే వెస్టిండీస్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన ఐర్లాండ్ ఓపెనర్లు, పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు చేసింది...
23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన ఆండ్రూ బాల్బీరిన్, అకీల్ హుస్సేన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 90 పరుగులు చేసిన ఐర్లాండ్, చేయాల్సిన రన్ రేట్ 6 కంటే తగ్గిపోవడంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది...
32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పాల్ స్టిర్లింగ్, లోర్కన్ టక్కర్‌తో కలిసి రెండో వికెట్‌కి అజేయంగా 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పాల్ స్టిర్లింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేయగా టక్కర్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్ కేల్ మేయర్స్ 5 బంతుల్లో 1 పరుగు చేసి అవుట్ కాగా జాన్సన్ ఛార్లెస్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. ఇవిన్ లూయిస్ 18 బంతుల్లో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
కెప్టెన్ నికోలస్ పూరన్ 11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి అవుట్ కాగా రోవ్‌మెన్ పావెల్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేశాడు. బ్రెండన్ కింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 62 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించగా ఓడియెన్ స్మిత్ 12 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 19 పరుగులు చేశాడు...
ఐర్లాండ్ బౌలర్ గారెత్ డెలనీ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు.