Asianet News TeluguAsianet News Telugu

ఇండియా- బంగ్లా మ్యాచ్‌కి వరుణుడి అంతరాయం... వర్షం ఆగకపోతే బంగ్లాదే విజయం...

7 ఓవర్లు ముగిసే సమయానికి 66 పరుగులు చేసిన బంగ్లాదేశ్... డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 పరుగుల తేడాతో బంగ్లా గెలిచే అవకాశం...

T20 World cup 2022: Rain interrupted, bangladesh 17 runs ahead to win in DLS Method
Author
First Published Nov 2, 2022, 4:16 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీతో బంగ్లాదేశ్, టీమిండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో 7 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది బంగ్లాదేశ్. ఈ సమయంలో వర్షం కురవడంతో మ్యాచ్‌ని నిలిపేశారు అంపైర్లు...

ఇప్పటికే బంగ్లాదేశ్ జట్టు 5 ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేయడంతో వర్షం కారణంగా మ్యాచ్ వల్ల ఆగిపోతే... డీఎల్‌ఎస్ విధానం (డక్ వర్త్ లూయిస్)  ద్వారా ఫలితం తేల్చబోతున్నారు. ఈ విధానం ప్రకారం 7 ఓవర్లు ముగిసే సమయానికి బంగ్లా 49 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే 66 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌కి 17 పరుగుల తేడాతో విజయం దక్కుతుంది...   ఒకవేళ వర్షం కారణంగా విలువైన సమయం కోల్పోవడంతో మ్యాచ్‌ని 10 ఓవర్లకు కుదిస్తే, బంగ్లాదేశ్ మిగిలిన 3 ఓవర్లలో 23 పరుగులు చేస్తే సరిపోతుంది.

185 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా ఓపెనర్ లిట్టర్ దాస్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్ ఇచ్చిన క్యాచ్‌ని దినేశ్ కార్తీక్ అందుకోలేకపోయాడు. టీవీ రిప్లైలో క్యాచ్ అందుకోవడానికి ముందే బంతి నేలను తాకినట్టు కనిపించింది. అలా బతికిపోయిన లిట్టన్ దాస్, రెండో ఓవర్‌లో 3 ఫోర్లు బాదాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్‌లో 6, 4, 4 బాదిన లిట్టన్ దాస్... షమీ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో 4, 6, 4 బాది 21 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..

మొత్తంగా 26 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసిన లిట్టన్ దాస్,  నజ్ముల్ హుస్సేన్‌తో కలిసి తొలి వికెట్‌కి 66 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. నజ్ముల్ హుస్సేన్ 16 బంతులాడి 7 పరుగులే చేయడం విశేషం. నజ్ముల్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేదు. పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో ఏడో ఓవర్‌ని అక్షర్ పటేల్‌తో వేయించాడు రోహిత్ శర్మ. ఈ ఓవర్‌లో 6 పరుగులే చేయగలిగింది బంగ్లా. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. రోహిత్ 8 బంతులాడి 2 పరుగులకే అవుట్ కాగా కెఎల్ రాహుల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేయగా హార్ధిక్ పాండ్యా 5, దినేశ్ కార్తీక్ 7, అక్షర్ పటేల్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 64 పరుగులు చేయగా రవిచంద్రన్ అశ్విన్ 6 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios