‘అర్హత’ ముగిసింది.. అసలు సమరం ముందుంది.. శనివారం నుంచే సూపర్-12 మొదలు
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 ఇదివరకే మొదలైనా వారం రోజులుగా జరిగినవి క్వాలిఫయర్ మ్యాచ్‌లే. శుక్రవారంతో అవి కూడా ముగిశాయి. ఇక శనివారం నుంచి ఈ మెగా టోర్నీలో అసలు సిసలు మజా మొదలవుతుంది.
బంతి పడటమే ఆలస్యమా అన్నట్టు ఆకాశానికి హాయ్ చెప్పే సిక్సర్లు.. బుల్లెట్ కంటే స్పీడ్‌గా బౌండరీ లైన్ దాటే ఫోర్లు.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే బౌలర్లు.. గింగిరాలు తిరుగుతూ బెయిల్స్‌ను ఎగురగొట్టే స్పిన్నర్ల విన్యాసాలు.. అసాధ్యమనుకున్న క్యాచ్‌ను సుసాధ్యం చేసే ఫీల్డర్లు.. రెప్పపాటులో వికెట్లను నేలకూల్చే రనౌట్లు.. సెకన్ల వ్యవధిలో స్టంపింగ్‌లు.. అన్నింటికీ మించి 12 దేశాల ఆటగాళ్లు, అభిమానుల భావోద్వేగాలు.. కొన్ని విజయాలు, మరికొన్ని పరాజయాలు.. కొందరికి ఆనందం.. మరికొందరికి దుఖం.. కోటానుకోట్ల మందికి వీనుల విందు.. వెరసి టీ20 ప్రపంచకప్‌లో రేపటి (శనివారం) నుంచి అసలు సిసలు సమరం మొదలుకానుంది. అక్టోబర్ 22 నుంచి టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశకు తెరలేవనుంది.
పొట్టి క్రికెట్‌లో అత్యున్నత క్రీడా పండుగ అయిన టీ20 ప్రపంచకప్‌లో కీలక ఘట్టం శనివారం నుంచి ప్రారంభం కానుంది. అధికారికంగా టోర్నీ గత ఆదివారం (అక్టోబర్ 16) నుంచే మొదలైనా.. ఈ ఆరు రోజులూ జరిగినవి క్వాలిఫయర్ మ్యాచ్‌లే. సూపర్-12 ఆడటానికి గాను ఎనిమిది జట్లు పోటీ పడగా.. అందులో టాప్-4లో నిలిచిన నాలుగు జట్లు రెండు గ్రూప్ లలో కలిశాయి. శనివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, గతేడాది రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ మొదలుకానున్నది.
ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో 16 జట్లు పోటీలో నిలిచినా.. క్వాలిఫికేషన్ రౌండ్ లో నాలుగు జట్లు ఇంటిబాట పట్టాయి. అందులో రెండుసార్లు మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ తో పాటు నమీబియా, స్కాట్లాండ్, యూఏఈ కూడా ఉన్నాయి. శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వేలు సూపర్-12కు చేరాయి.
శనివారం భారత కాలమానం మధ్యాహ్నాం 12.30 గంటలకు ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ తో ఈ టోర్నీ అసలు సమరానికి సిద్ధమవుతుంది. సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ తో పాటు శనివారం సాయంత్రం 4.30 నుంచి ఇంగ్లాండ్ - అఫ్గానిస్తాన్ మధ్య కూడా మ్యాచ్ జరుగనుంది. ఇక ఆ తర్వాత ధనాధన్ దమాకాకు కొదవ లేదు. ఈ టోర్నీలో డబుల్ హెడర్ (ఒక రోజు రెండు మ్యాచ్ లు) లే కాదు.. ఒక్కోరోజు ట్రిపుల్ హెడర్ లు కూడా ఉన్నాయి.
సూపర్ - 12 జట్ల వివరాలు :
గ్రూప్ - ఏ : అఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్
గ్రూప్ - బి : బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, జింబాబ్వే, నెదర్లాండ్స్
- అక్టోబర్ 22 నుంచి మొదలయ్యే సూపర్ - 12 రౌండ్ నవంబర్ 6 వరకు సాగుతుంది. ఆ తేదీతో ఈ రౌండ్ ముగుస్తుంది. నవంబర్ 9 నుంచి తొలి సెమీస్ సిడ్నీ లో, నవంబర్ 10న రెండో సెమీస్ అడిలైడ్ లో జరుగుతాయి. ఇక తుది పోరు నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతుంది
- ఆస్ట్రేలియాలోని ఏడు వేదికలు (మెల్‌బోర్న్, అడిలైడ్, సిడ్నీ, గబ్బా, గీలాంగ్, హోబర్ట్, పెర్త్) ఈ మ్యాచ్ లకు ఆథిత్యమివ్వనున్నాయి.
టీవీ, మొబైల్‌లో ఇలా..
ఈ మెగా టోర్నీని భారత్ లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నది. స్టార్ కు సంబంధించిన హిందీ, ఇంగ్లీష్ స్పోర్ట్స్ ఛానెల్స్ లో లైవ్ ప్రసారాలు చూడొచ్చు. అంతేగాక మొబైల్స్ లో చూడాలనుకునేవారు డిస్నీ హాట్ స్టార్ లలో కూడా లైవ్ చూడొచ్చు.