సఫారీలకు తొలి ఓటమి.. ఇంకా మిగిలే ఉన్న పాకిస్తాన్ సెమీస్ ఆశలు..

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా పాకిస్తాన్ చేతిలో సఫారీలు చిత్తయ్యారు.  వర్షం అంతరాయం కలిగించిన నేటి మ్యాచ్ లో  గెలవడం ద్వారా ఈ  మెగా టోర్నీలో  పాకిస్తాన్  సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. 

T20 World Cup 2022: Pakistan Beat South Africa by 33 Run in DLS Method

టీ20 ప్రపంచకప్ లో  సౌతాఫ్రికాకు ఓటమి రుచి చూపిస్తూ పాకిస్తాన్ సూపర్ విక్టరీ కొట్టింది. సెమీస్ రేసులో  తాను కూడా ఉన్నానని నిరూపిస్తూ  ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ లో ఆ జట్టు 33 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్) తో గెలిచింది. ఐసీసీ టోర్నీలలో దక్షిణాఫ్రికాను నిండా ముంచే వర్షం.. నేడు కూడా అదే సీన్ ను రిపీట్ చేసింది. వర్షం వల్ల నిన్నటి భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ లో కనిపించిన సన్నివేశాలే నేడూ దర్శనమిచ్చాయి. ఒత్తిడిలో దక్షిణాఫ్రికా చిత్తైంది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (4), బాబర్ ఆజమ్ (6) లు విఫలమైనా.. ఇఫ్తికార్ అహ్మద్ (51), షాదాబ్ ఖాన్ (52) లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి పాక్ కు భారీ స్కోరు అందించారు. 

అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా.. తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది.  ఫామ్ లో ఉన్న క్వింటన్ డికాక్ (0) డకౌట్ అయ్యాడు.  బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన రిలీ రొసోవ్ (7) కూడా విఫలమయ్యాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న  కెప్టెన్ టెంబ బవుమా... 19 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 36 పరుగులు చేశాడు.  ఎయిడెన్ మార్క్రమ్ (20) తో కలిసి మూడో వికెట్ కు  49 పరుగులు జోడించాడు.  7 ఓవర్లకు సఫారీ స్కోరు 2 వికెట్ల నష్టానిక 65 పరుగులు.. 

8వ ఓవర్ వేసిన షాదాబ్ ఖాన్ సఫారీలకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.  తొలి బంతికి బవుమా వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటవగా.. మూడో బంతికి మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 ఓవర్లు ముగిశాక  వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది.  కొద్దిసేపటి తర్వాత  మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. సఫారీ ఇన్నింగ్స్ ను 14 ఓవర్లకు కుదించారు. అంటే సౌతాఫ్రికా లక్ష్యం.. 5 ఓవర్లలో  73 పరుగులు. 

సేమ్ సీన్ రిపీట్.. 

బుధవారం భారత్-బంగ్లా మ్యాచ్ లో వర్షం తర్వాత  బంగ్లా బ్యాటర్లు ఒత్తిడికి చిత్తై ఎలా పెవిలియన్ చేరారో నేటి మ్యాచ్ లో కూడా అదే సీన్ కనిపించింది. షాదాబ్ ఖాన్  వేసిన పదో ఓవర్లో  14 పరుగులు పిండుకున్న సఫారీ బ్యాటర్లు తర్వాత చేతులెత్తేశారు. షాహీన్ అఫ్రిది వేసిన 11వ ఓవర్లో రెండు వరుస బౌండరీలు కొట్టిన క్లాసెన్ (15) .. ఐదో బంతికి భారీ షాట్ ఆడబోయి మహ్మద్ వసీంకు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత ఓవర్ వేసిన వసీం.. పార్నెల్ (3) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కిపంపాడు. నసీమ్ షా.. ట్రిస్టన్ స్టబ్స్ ను ఔట్ చేయగా హరీస్ రౌఫ్ చివరి ఓవర్లో రబాడా, నోర్త్జ్ లను పెవిలియన్ కు పంపాడు.  14 ఓవర్లలో సౌతాఫ్రికా.. 9 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఫలితంగా పాక్ 33 పరగుల తేడాతో విక్టరీ కొట్టింది. 

 

మూడో స్థానానికి పాక్.. 

ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడిన సౌతాఫ్రికాకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. ఇక పాకిస్తాన్ ఈ విజయం ద్వారా గ్రూప్:-2లో మూడో స్థానానికి ఎగబాకింది.  ఈ విజయం ద్వారా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.  ఆ జట్టు తర్వాత ఆడబోయే బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో గెలిస్తే అప్పుడు గ్రూప్ - 2 నుంచి సెమీస్ రేసు ఆసక్తికరంగా మారుతుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios