ఏమిరా బాలరాజు.. ఏమిరా నీవల్ల ఉపయోగం జట్టుకు..! మళ్లీ విఫలమైన రాహుల్.. ట్విటర్‌లో పేలుతున్న ట్రోల్స్
T20 World Cup 2022: ఈ మెగా టోర్నీలో ఇంతవరకు రాహుల్ మూడు మ్యాచ్ లలో 22 పరుగులు మాత్రమే చేశాడు. సోషల్ మీడియా వేదికగా కెఎల్ రాహుల్ పై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటికైనా రాహుల్ ను వదిలించుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ లో భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికై కీలక బ్యాటర్ గా ఉన్న కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమవుతున్నాడు. వరుస మ్యాచ్ లలో విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో పాటు నేడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో కూడా అదే ఆటతీరుతో విఫలమై పెవిలియన్ చేరాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా కెఎల్ రాహుల్ పై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటికైనా రాహుల్ ను వదిలించుకుని రిషభ్ పంత్ ను ఆడించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ మెగా టోర్నీలో ఇంతవరకు రాహుల్ మూడు మ్యాచ్ లలో వరుసగా 4, 9, 9 (మొత్తంగా 22) పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్తాన్ తో ఆసియా కప్ మాదిరిగానే నసీమ్ షా బౌలింగ్ లో బంతిని వికెట్ల మీదకు ఆడుకుని క్లీన్ బౌల్డ్ కాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడు. ఇక నేడు లుంగి ఎంగిడి బౌలింగ్ లో స్లిప్స్ లో మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చ వెనుదిరిగాడు.
నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో విఫలమయ్యాక రాహుల్ పై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ పేలిన విషయం తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్ తర్వాత కూడా ట్విటర్ లో నెటిజన్లు రాహుల్ ను ఆటాడుకున్నారు. ట్విటర్ వేదికగా ప్యాషనెట్ ఫ్యాన్ అని రాసి ఉన్న ఓ యూజర్.. ‘ఇక చాలు.. కెఎల్ రాహుల్ ను జట్టు నుంచి తొలగించండని మేము నెత్తి నోరు మొత్తుకుంటున్నాం. అయినా టీమ్ మేనేజ్మెంట్ మా మాట వినడం లేదు. రాహుల్ ను ఏ ఫార్మాట్ లో కూడా ఆడించకండి. టీమిండియా ఫ్యాన్స్ గా ఇదే మా విన్నపం.. ’ అని స్పందించాడు. ఈ యూజర్ మాదిరిగానే చాలా మంది నెటిజన్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అసలు అతడికి జట్టులో ఆడే అర్హత లేదని.. అటువంటి వాడికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా రాహుల్ ను పక్కనబెట్టి వికెట్ కీపర్ రిషభ్ పంత్ తో ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా అయితే భారత్ కు ఓపెనింగ్ జోడీ కుడి ఎడమ చేతి వాటం బ్యాటర్లు దొరుకుతారని అభిప్రాయపడుతున్నారు. జహాజీ అనే ఓ యూజర్.. ‘కెఎల్ రాహుల్ ఔట్ అయ్యాక బౌలర్, ఫీల్డర్లు సెలబ్రేట్ చేసుకోవడం లేదంటే అతడెంత దరిద్రంగా ఆడుతున్నాడో బీసీసీఐకి అర్థం కావడం లేదా..?’ అని ప్రశ్నించాడు.
ఇదే సందు అనుకుని ప్రపంచకప్ కు ఎంపిక చేయలేదనే కోపంతో సంజూ శాంసన్ ఫ్యాన్స్ కూడా బీసీసీఐపై తమ కసి తీర్చుకుంటున్నారు. ‘మా శాంసన్ ను కాదని రాహుల్, దీపక్ హుడా ను ఎంపిక చేశారు కదా.. అనుభవించండి..’ అని ట్రోల్స్ తో ట్విటర్ ను హోరెత్తిస్తున్నారు.
రాహుల్ మీద ఆగ్రహంతో పాటు ఫన్నీ మీమ్స్, జిఫ్ ఇమేజెస్, తనకు కాబోయే మామ సునీల్ శెట్టి పాత బాలీవుడ్ సినిమాలకు సంబంధించిన వీడియోలతో ట్రోల్స్ చేస్తూ నెటిజన్లు ఫన్ తో పాటు ఈ ఓపెనర్ పై ఫ్రస్ట్రేషన్ ను కూడా వ్యక్తం చేస్తున్నారు.