Asianet News TeluguAsianet News Telugu

టీ20 వరల్డ్ కప్ 2022: జింబాబ్వే సెమీ ఫైనల్ ఆశలపై నీళ్లు... నెదర్లాండ్ చేత్తుల్లో చిత్తుగా ఓడి...

జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న నెదర్లాండ్స్... సెమీస్ రేసు నుంచి తప్పుకున్న నెదర్లాండ్స్, జింబాబ్వే... 

T20 World cup 2022: Netherlands beats Zimbabwe, Semi-final hopes of zim goes vein
Author
First Published Nov 2, 2022, 12:44 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో తొలిసారి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించిన జింబాబ్వే ... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో గెలిచి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో 3 పాయింట్లతో అన్యూహ్యంగా సెమీస్ రేసులోకి దూసుకొచ్చిన జింబాబ్వే... అదే జోరు కొనసాగించలేకపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్ట్ ఓవర్‌ దాకా పోరాడి 3 పరుగుల తేడాతో ఓడిన జింబాబ్వే, తాజాగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో చిత్తుగా ఓడి, సెమీస్ రేసు నుంచి తప్పుకుంది...

నెదర్లాండ్స్‌ జట్టుకి, టీ20 వరల్డ్ కప్ 2022 సూపర్ 12 రౌండ్‌లో ఇదే తొలి విజయం. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 19.2 ఓవర్లలో 117 పరుగులకి ఆలౌట్ అయ్యింది. వెస్లీ మెదెవేరే 1,కెప్టెన్ క్రెగ్ ఎర్వీన్ 12 బంతుల్లో 3, వికెట్ కీపర్ చకబ్వా 16 బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే.

ఈ దశలో శాన్ విలియమ్స్ 23 బంతుల్లో 3 ఫోర్లతో 28 పరుగులు, సికందర్ రజా 24 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి జింబాబ్వేని ఆదుకున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే శాన్ విలియమ్స్ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. మిల్టన్ షుంబా 2, రియాన్ బర్ల్ 2, జాంగ్వే 6, నగరవా 9, ముజరబానీ 1 పరుగు చేసి అవుట్ కావడంతో 117 పరుగుల వద్ద జింబాబ్వే ఇన్నింగ్స్‌కి తెరపడింది...

నెదర్లాండ్స్ బౌలర్లు వాన్ మీకీరన్ 3 వికెట్లు తీయగా బ్రెండన్ గ్లోవన్, వాన్ బీక్, బస్ దే లీడే రెండేసి వికెట్లు తీశారు. 118 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన నెదర్లాండ్స్‌.. ఓపెనర్ స్టీఫెన్ మైబర్గ్ వికెట్ త్వరగా కోల్పోయింది. 7 బంతుల్లో  ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన స్టీఫెన్ మైబర్గ్, ముజరాబానీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత మ్యాక్స్‌ ఓడాడ్, టామ్ కూపర్ కలిసి రెండో వికెట్‌కి 73 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 29 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 పరుగులు చేసిన టాప్ కూపర్ అవుటైనా మ్యాక్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోలిన్ అకీర్‌మన్ 1 పరుగు చేసి నిరాశపరిచినా మ్యాక్స్ ఓడాడ్ 47 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... నెదర్లాండ్స్ విజయానికి 2 పరుగులు కావాల్సిన సమయంలో  స్కాట్ ఎడ్వర్డ్స్ (5 పరుగులు) అవుట్ అయ్యాడు. అయితే అప్పటికి నెదర్లాండ్స్‌ విజయానికి 21 బంతుల్లో 2 పరుగులు మాత్రమే కావాలి. దీంతో పెద్దగా డ్రామా లేకుండానే వాన్ దేర్ మెర్వే, బస్ దే లీడ్ కలిసి మ్యాచ్‌ని ముగించేశారు...

 

Follow Us:
Download App:
  • android
  • ios