Asianet News TeluguAsianet News Telugu

ప్లేయర్లు జారపడకుండా బ్రష్‌తో బూట్లను తుడిచి... రఘు చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా...

వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్‌లో బురద... ప్లేయర్లు జారిపడకుండా ప్రత్యేక కేర్ తీసుకున్న భారత సైడ్ఆర్మ్ త్రోయర్ రఘు... 

T20 World cup 2022: Indian Sidearm thrower Raghu wins heart with great job in India vs Bangladesh
Author
First Published Nov 3, 2022, 9:57 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేస్తే... బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ‘సై’ సినిమాలో ‘రగ్భీ’ మ్యాచ్‌ని తలపించింది. ఫస్టాఫ్‌కి ముందు ఒక్క గోల్ చేయడానికి అష్టకష్టాలు పడిన ప్లేయర్లు, సెకండాఫ్‌లో చెలరేగిపోయి... బుల్స్ టీమ్‌కి చుక్కలు చూపించినట్టుగా... వర్షం అంతరాయం కలిగించడానికి ముందు లిట్టన్ దాస్ సెన్సేషనల్ హాఫ్ సెంచరీ కారణంగా ధారాళంగా పరుగులు సమర్పించిన బౌలర్లు, బ్రేక్ తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు...

27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసిన లిట్టన్ దాస్... భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. భువీ, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ వంటి భారత టాప్ బౌలర్లను చక్కగా ఎదుర్కొంటూ బౌండరీల వర్షం కురిపించాడు. దాస్ ఆడిన మాస్ ఇన్నింగ్స్ కారణంగా 7 ఓవర్లు ముగిసే సమయానికి 66 పరుగులు చేసింది బంగ్లాదేశ్...

వర్షం ఆగకపోయి ఉంటే డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లాదేశ్ 17 పరుగుల తేడాతో టీమిండియాని ఓడించి ఉండేది. అయితే వర్షం తగ్గి, ఆట తిరిగి ప్రారంభం కావడం.. ఆ తర్వాత రెండో బంతికే లిట్టన్ దాస్ రనౌట్ కావడం మ్యాచ్‌ని మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం నిర్ణయించిన 151 పరుగుల లక్ష్యానికి 6 పరుగుల దూరంలో ఆగిపోయింది...

వర్షం వల్ల బ్రేక్ రావడంతో అవుట్ ఫీల్డ్ పూర్తిగా తడిసిపోయింది. సాధారణంగా అయితే పిచ్ ఆరేంత వరకూ ఆటను నిలిపివేస్తారు. ఎందుకంటే ప్లేయర్లు జారిపడి, గాయపడే ప్రమాదం ఉంటుంది. అయితే వరల్డ్ కప్‌లో కీలక మ్యాచ్ కావడంతో అంపైర్లు, ఇద్దరు కెప్టెన్లతో చర్చించి... ఆటను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు...

అయితే భారత ఫీల్డర్లు, ఈ తడిచిన పిచ్‌పై ఫీల్డింగ్ చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సమయంలోనే భారత సైడ్‌ఆర్మ్ త్రోవర్ రఘు... చేతిలో బ్రష్ పట్టుకుని గ్రౌండ్ అంతా తిరుగుతూ కనిపించాడు. భారత బ్యాట్స్‌మెన్ నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వారికి సైడ్ ఆర్మ్‌తో బౌలింగ్ వేయడమే రఘు పని.

తడిసిన పిచ్‌, బురదలో పరుగెత్తిన భారత ఫీల్డర్ల షూలకు అంటుకుపోయిన బురదను క్లీన్ చేశాడు రఘు. ఇలా స్టేడియమంతా తిరుగుతూ చాలాసేపు ఫీల్డర్ల సేఫ్టీ చూసుకున్నాడు. రఘు చేసిన ఈ పని... ప్రేక్షకుల మనసు దోచుకుంది. సాధారణంగా వేరేవాళ్ల షూస్ తాకడానికే చాలా అవమానకరంగా భావిస్తారు భారతీయులు. అయితే రఘు, ప్లేయర్ల భద్రత ముఖ్యమనే ఉద్దేశంతో స్టేడియమంతా కలియ తిరుగుతూ బూట్లను క్లీన్ చేశాడు... 

చాలా చిన్న పనిగా అనిపిస్తున్నా, రఘు చేసిన పని వల్ల ఏ భారత ఫీల్డర్ కూడా గాయపడలేదు. సౌతాఫ్రికాతో మ్యాచ్ ఓడిన తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విజయం అందుకున్న టీమిండియా... సెమీస్‌కి చేరువైంది. జింబాబ్వేతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో గెలిచినా, వర్షం వల్ల డ్రా చేసుకున్నా టీమిండియా సెమీ ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది... 

Follow Us:
Download App:
  • android
  • ios