టీ20 వరల్డ్ కప్ ఫైనల్: ఇంగ్లాండ్ ముందు ఈజీ టార్గెట్... పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్...
ఇంగ్లాండ్ ముందు 138 పరుగుల టార్గెట్.. 38 పరుగులు చేసిన షాన్ మసూద్, 32 పరుగులు చేసిన బాబర్ ఆజమ్... 3 వికెట్లు తీసిన సామ్ కుర్రాన్...
టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతినే నో బాల్‌గా వేశాడు బెన్ స్టోక్స్. ఈ ఓవర్‌లో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మహ్మద్ రిజ్వాన్, ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు...
14 బంతుల్లో ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన మహ్మద్ హారీస్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 32 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో బాబర్ ఆజమ్ వికెట్ తీసిన అదిల్ రషీద్, వికెట్ మెయిడిన్ వేశాడు. 6 బంతులాడినా పరుగులేమీ చేయలేకపోయిన ఇఫ్తికర్ అహ్మద్, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 28 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేసిన షాన్ మసూద్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో లియామ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
14 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసిన షాదబ్ ఖాన్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో అవుట్ కాగా అదే ఓవర్‌లో మహ్మద్ వసీం జూనియర్ ఇచ్చిన క్యాచ్‌ని హ్యారీ బ్రూక్ జారవిడిచాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేసిన మహ్మద్ నవాబ్ కూడా సామ్ కుర్రాన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...
మహ్మద్ వసీం జూనియర్ 4 పరుగులు చేసి అవుట్ కాగా, షాహీర్ ఆఫ్రిదీ 5 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. పాక్ ఇన్నింగ్స్‌లో ఆఖరి 5 ఓవర్లలో 2 ఫోర్లు మాత్రమే రాగా 31 పరుగులు మాత్రమే వచ్చాయి.
4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చిన సామ్ కుర్రాన్, 3 వికెట్లు పడగొట్టాడు.