బట్లర్ వీరవిహారం.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కివీస్ ముందు భారీ లక్ష్యం నిలిపిన ఇంగ్లాండ్
T20 World Cup 2022: తొలి పవర్ ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో కూడా దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్.. చివర్లో తడబడి త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఈ టోర్నీలో సెమీస్ ఆశలు నిలుపుకోవాలంటే ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ ను నిలువరిస్తేనే ఆ జట్టుకు అవకాశాలుంటాయి.
టీ20 ప్రపంచకప్ లో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ రెచ్చిపోయింది. ఇన్నింగ్స్ చివర్లో తడబడినా.. న్యూజిలాండ్ ముందు ఊరించే టార్గెట్ పెట్టింది. కెప్టెన్ జోస్ బట్లర్ (47 బంతుల్లో 73, 7 ఫోర్లు, 2 సిక్సర్ల) వీరవిహారం చేయడంతో పాటు ఓపెనర్ అలెక్స్ హేల్స్ హాఫ్ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తొలి పవర్ ప్లేతో పాటు మిడిల్ ఓవర్లలో కూడా దూకుడుగా ఆడిన ఇంగ్లాండ్.. చివర్లో తడబడి త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. ఈ టోర్నీలో సెమీస్ ఆశలు నిలుపుకోవాలంటే ఆ జట్టు బౌలర్లు న్యూజిలాండ్ ను ఎలా నిలువరిస్తారనేదానిపై ఇంగ్లాండ్ సెమీస్ ఆశలు ఆధారపడ్డాయి.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. అలెక్స్ హేల్స్ (40 బంతుల్లో 52, 7 పోర్లు, 1 సిక్సర్) తో పాటు కెప్టెన్ జోస్ బట్లర్ దూకుడుగా ఆడటంతో తొలి వికెట్ కు ఇంగ్లాండ్ 81 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అర్థ సెంచరీ తర్వాత బంతికే హేల్స్.. సాంట్నర్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు.
హేల్స్ స్థానంలో క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ (5) విఫలమయ్యాడు. కానీ హేల్స్ బాదినంత సేపు అతడికే స్ట్రైక్ ఇచ్చిన బట్లర్.. అతడు వెళ్లాక బాదుడు కార్యక్రమం మొదలుపెట్టాడు. సాంట్నర్ వేసిన 5 ఓవర్లో మూడో బంతికి కేన్ విలియమ్సన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నా టీవీ రిప్లేలో అది గ్రౌండ్ కు తాకినట్టు తేలడంతో బతికిపోయిన బట్లర్.. అర్థ సెంచరీ తర్వాత రెచ్చిపోయాడు.
ఫెర్గూసన్ వేసిన ద 13వ ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టాడు. కానీ తర్వాత బంతికి డారెల్ మిచెల్ క్యాచ్ మిస్ చేయడంతో బట్లర్ కు రెండో లైఫ్ దొరికింది. అదే ఓవర్లో బట్లర్ మరో రెండు బౌండరీలు బాదాడు. ఇష్ సోధీ వేసిన 14ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌల్ట్ వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. 64 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత బట్లర్.. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఇయాన్ మోర్గాన్ పేరిట ఉన్న (2458) రికార్డును బద్దలు కొట్టాడు.
మోయిన్ అలీ ఔటయ్యాక వచ్చిన విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ (13 బంతుల్లో 20, 1 ఫోర్, 1 సిక్సర్) కూడా ప్రతీ బంతిని బాదుడే పనిగా పెట్టుకున్నాడు. ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించిన లివింగ్‌స్టోన్.. తర్వాత బంతికి మళ్లీ అదే షాట్ ఆడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
లివింగ్‌స్టోన్ నిష్క్రమించాక వచ్చిన హ్యారీ బ్రూక్ (7) ఓ సిక్సర్ కొట్టి టిమ్ సౌథీ బౌలింగ్ లో ఫిన్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫెర్గూసన్ వేసిన 18వ ఓవర్లో 6 పరుగులే రాగా సౌథీ వేసిన 19వ ఓవర్లో 9 పరుగులొచ్చాయి. 20వ ఓవర్ లో 16 పరుగులొచ్చాయి. మిడిల్ ఓవర్లలో ఇంగ్లాండ్ చూపిన దూకుడు చివర్లో కూడా చూపుంటే ఆ జట్టు స్కోరు ఈజీగా 200 దాటేది. ఇక కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా.. టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ తలా ఓ వికెట్ పడగొట్టారు.