టీ20 వరల్డ్ కప్ 2022: ఆతిథ్య జట్టుకి షాక్ ఇచ్చిన కివీస్... తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తు...

T20 World cup 2022: న్యూజిలాండ్ చేతుల్లో 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా... ఫిన్ ఆలెన్ మెరుపులు, డివాన్ కాన్వే హాఫ్ సెంచరీ...

T20 World cup 2022: Australia lost against New Zealand in Super 12 round match

టీ20 వరల్డ్ కప్ 2022 టైటిల్ ఫెవరెట్, ఆతిథ్య ఆస్ట్రేలియాకి తొలి మ్యాచ్‌లో ఊహించని షాక్ ఇచ్చింది న్యూజిలాండ్. సూపర్ 12 రౌండ్ ప్రారంభ మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుని, 2021 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ చేతుల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది కివీస్. 

201 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 5 పరుగులకే డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ని టిమ్ సౌథీ క్లీన్ బౌల్డ్ చేయగా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

మిచెల్ మార్ష్ 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేయగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ 20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. మార్కస్ స్టోయినిస్ 14 బంతుల్లో 7 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ 8 బంతుల్లో ఓ సిక్సర్‌తో 11 పరుగులు చేయగా మాథ్యూ వేడ్ 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. 

89 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపాలను ఒకే ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ చేశాడు ట్రెంట్ బౌల్ట్.  ప్యాట్ కమ్మిన్స్ 21 పరుగులు చేసి అవుట్ కావడంతో 17.1 ఓవర్లలో 111 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కి తెరపడింది.

అంతకుముందు టాస్ గెలిచి న్యూజిలాండ్‌కి బ్యాటింగ్ అప్పగించింది ఆస్ట్రేలియా. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు చేసింది.. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న ఫిన్ ఆలెన్, మొదటి ఓవర్ నుంచి ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టిన ఫిన్ ఆలెన్, ప్యాట్ కమ్మిన్స్ వేసిన 3వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 17 పరుగులు రాబట్టాడు..

16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన ఫిన్ ఆలెన్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లేలో ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది న్యూజిలాండ్. కెప్టెన్ కేన్ విలియంసన్ 23 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు...

గ్లెన్ ఫిలిప్స్ 10 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓపెనర్ డివాన్ కాన్వే 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా జేమ్స్ నీశమ్ 13 బంతుల్లో 2  సిక్సర్లతో 26 పరుగులు చేశాడు...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios