అఫ్గాన్ ఓడి ఇంటికెళ్లింది.. ఆసీస్ గెలిచినా సెమీస్‌కు కష్టమే..! లంకమీదే కొండంత ఆశలు..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ ఆఫ్ డెత్ గా ఉన్న గ్రూప్-1లో సెమీస్ కు వెళ్లే రెండో జట్టు ఏదో తెలియాలంటే శనివారం దాకా ఆగాల్సిందే. నేడు ఆస్ట్రేలియా-అఫ్గానిస్తాన్ మ్యాచ్ లో కంగారూలు గెలిచినా, అఫ్గాన్లు ఓడినా పెద్ద తేడా లేదు.
టీ20 ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం ఆస్ట్రేలియాకు భారీ షాక్ తప్పేలా లేదు. ఈ మెగా టోర్నీలో నిలవాలంటే తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్ లో కంగారూలు గెలిచినా సెమీస్ బెర్త్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో గెలవడంతో పాటు సెమీస్ చేరాలంటే ఆసీస్.. అఫ్గాన్ ను 107 పరగుల లోపే నిలువరించాలి. అప్పుడు ఆ జట్టు నెట్ రన్ రేట్ మెరుగుపడి ఇంగ్లాండ్ - శ్రీలంక మ్యాచ్ ఫలితం ద్వారా ఆసీస్ సెమీస్ చేరే అవకాశం ఉండేది. కానీ అలా జరుగలేదు. అఫ్గాన్.. 20 ఓవర్ల పాటు ఆడి 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి దాదాపు గెలిచినంత పని చేసింది. 4 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచినా ఇప్పుడు శ్రీలంక.. ఇంగ్లాండ్ ను ఓడిస్తేనే కంగారూలు సెమీస్ కు వెళ్తారు.
మెస్తారు లక్ష్య ఛేదనలో అఫ్గాన్ ఓపెనర్ గుర్బాజ్ (17 బంతుల్లో 30, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హెజిల్వుడ్ వేసిన తొలి ఓవర్లోనే 4, 6 కొట్టాడు. హెజిల్వుడ్ వేసిన తర్వాత ఓవర్లో మూడో బంతికి మరో ఓపెనర్ ఉస్మాన్ ఘనీ (2) నిష్క్రమించాడు. రిచర్డ్‌సన్ వేసిన ఆరో ఓవర్లో గుర్బాజ్.. తొలి బంతిని గ్రీన్ క్యాచ్ మిస్ ద్వారా బతికిపోయినా.. మూడో బంతికి వార్నర్ చేతికి చిక్కాడు.
ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్ (33 బంతుల్లో 26, 2 ఫోర్లు), గుల్బాదిన్ నయిబ్ (23 బంతుల్లో 39, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆచితూచి ఆడారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 59 పరుగులు జోడించారు. సవ్యంగా సాగుతున్న అఫ్గాన్ ఇన్నింగ్స్ లో అడమ్ జంపా కల్లోలం సృష్టించాడు. అతడు వేసిన 14వ ఓవర్లో గుల్బాదిన్ రనౌట్ అవగా.. ఇబ్రహీం, నజీబుల్లా (0) లు క్యాచ్ లు ఇచ్చి పెవిలియన్ చేరారు. దీంతో 98-2 గా ఉన్న స్కోరుబోర్డు కాస్తా.. ఒక్క ఓవర్ తర్వాత 101-5గా మారింది.
15వ ఓవర్లో మూడో బంతికి హెజిల్వుడ్.. నబీ (1) ని ఔట్ చేశాడు. కానీ తర్వాత ఓవర్లో 6 పరుగులొచ్చాయి. దీంతో 16 ఓవర్ల తర్వాత ఆ జట్టు 112 పరుగులు చేసింది. దీంతో ఆసీస్.. నెట్ రన్ రేట్ విషయంలో వెనుకబడ్డట్టైంది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్.. త్వరగానే బ్యాగులు సర్దుకుంటుందేమోనని అనుకున్నారు. కానీ.. రషీద్ ఖాన్ (23 బంతుల్లో 48 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. దాదాపు అఫ్గాన్ ను గెలిపించినంత పని చేశాడు. చివరి ఓవర్లో 22 పరుగులు అవసరం కాగా 16 పరుగులు చేశాడు.