Asianet News TeluguAsianet News Telugu

బర్త్ డే పార్టీలో జారిపడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరం...

ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో పరుగెత్తుతూ జారిపడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్... మూడు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరం...

T20 World cup 2022: Australia All-rounder Glenn Maxwell injured and out of action for 3 months
Author
First Published Nov 13, 2022, 11:34 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు గ్రూప్ స్టేజీకే పరిమితమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారీ అంచనాలతో మెగా టోర్నీని ప్రారంభించిన ఆసీస్‌కి మొదటి మ్యాచ్‌లోనే కోలుకోలేని షాక్ ఇచ్చింది న్యూజిలాండ్. కివీస్ చేతుల్లో 89 పరుగుల భారీ తేడాతో ఓడిన ఆస్ట్రేలియా... ఆ తర్వాత మూడు మ్యాచుల్లో గెలిచింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దయింది...

అయితే 7 పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా కంటే మెరుగైన రన్ రేట్ సాధించిన ఇంగ్లాండ్ జట్టు, సెమీ ఫైనల్‌కి అర్హత సాధించింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, మూడు నెలల పాటు జట్టుకి దూరమైనట్టు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ బర్త్ డే పార్టీకి హాజరైన గ్లెన్ మ్యాక్స్‌వెల్, రన్నింగ్ చేస్తూ జారిపడ్డాడట. ఈ ప్రమాదంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కాలికి తీవ్ర గాయం అయ్యిందని, అది మానడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని డాక్టర్లు తెలియచేసినట్టు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

ఈ వారంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ కాలికి సర్జరీ జరగనుంది. 34 ఏళ్ల మ్యాక్స్‌వెల్, బర్త్ డే పార్టీ చేసుకుంటున్న 50 ఏళ్ల వ్యక్తితో కలిసి పరుగెతుత్తూ జారిపడ్డాడట. ఈ ప్రమాదంలో టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కి గ్లెన్ మ్యాక్స్‌వెల్ దూరమయ్యాడు...

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్‌లో టీమిండియాని ఓడించి మూడోసారి ఫైనల్ చేరింది ఇంగ్లాండ్. మరో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై గెలిచిన పాకిస్తాన్‌తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడనుంది ఇంగ్లాండ్ జట్టు. పాకిస్తాన్ జట్టు 2009లో టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలవగా, ఆ తర్వాతి ఏడాది 2010లో ఇంగ్లాండ్ పొట్టి ప్రపంచకప్‌ని కైవసం చేసుకుంది...

ఇరు జట్లలో ఎవరు ఫైనల్ గెలిచినా రెండోసారి టైటిల్ కైవసం చేసుకుంటారు. ఇప్పటివరకూ వెస్టిండీస్ మాత్రమే 2012, 2016 ఎడిషన్లలో టీ20 వరల్డ్ కప్ గెలిచి, రెండు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ఉంది. అయితే ఆదివారం మెల్‌బోర్న్‌లో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలియచేసింది.

ఒకవేళ ఆదివారం వర్షం కురిసే మ్యాచ్ సజావుగా సాగకపోతే రిజర్వు డేగా సోమవారం మ్యాచ్‌ని నిర్వహిస్తారు. సోమవారం కూడా వర్షం అంతరాయం కలిగించి, మ్యాచ్ సాగకపోతే... ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారు అంపైర్లు. 

Follow Us:
Download App:
  • android
  • ios