నిలబడి తడబడిన ఆసీస్.. చివరి ఓవర్లలో వైఫల్యం.. అఫ్గాన్ ముందు ఊరించే టార్గెట్
T20 World Cup 2022: సెమీస్ ఆశలు నిలుపుకోవాంటే భారీ తేడాతో నెగ్గాల్సిన మ్యాచ్ లో ఆసీస్ బ్యాటింగ్ లో విఫలమైంది. ఆసీస్ ప్రధాన ఆటగాళ్లైన కెప్టెన్ ఆరోన్ ఫించ్, టిమ్ డేవిడ్, పేసర్ మిచెల్ స్టార్క్ లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్ కీలక సమయంలో వికెట్లు కోల్పోయి అఫ్గాన్ ముందు ఊరించే టార్గెట్ పెట్టింది.
ఆసక్తికరంగా మారిన గ్రూప్-2 సెమీస్ రేసులో తమ చివరి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో తడబడింది. ఆసీస్ ప్రధాన ఆటగాళ్లైన కెప్టెన్ ఆరోన్ ఫించ్, టిమ్ డేవిడ్, పేసర్ మిచెల్ స్టార్క్ లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్ కీలక సమయంలో వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సారథ్యంలోని ఆసీస్.. మిడిల్ ఓవర్లలో అఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డా చివరి ఐదు ఓవర్లలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడమే గాక పరుగులు చేయడానికి ఇబ్బంది పడింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. సెమీస్ రేసులో నిలవాలంటే ఆసీస్.. అఫ్గాన్ ను 106 పరుగుల లోపే కట్టడి చేయాలి. అలా చేస్తే నెట్ రన్ రేట్ విషయంలో ఇంగ్లాండ్ ను అధిగమించే ఛాన్స్ ఉంటుంది. మరి ఆసీస్ పేసర్లు ఏం చేస్తారో..?
ఫించ్ లేకపోవడంతో ఓపెనర్లుగా కామెరూన్ గ్రీన్ (3), డేవిడ్ వార్నర్ (25) లు బరిలోకి దిగారు. రెండో ఓవర్లో వార్నర్.. మూడు ఫోర్లు కొట్టాడు. కానీ మూడో ఓవర్ తొలి బంతికే ఫరూఖీ.. గ్రీన్ ను ఔట్ చేసి అఫ్గాన్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు. భారత్ తో సిరీస్ లో రెచ్చిపోయి ఆడిన గ్రీన్.. తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్ లలో దారుణంగా విఫలమవ్వడం (14, 1, 1, 3) గమనార్హం.
గ్రీన్ ఔటయ్యాక మిచెల్ మార్ష్ (30 బంతుల్లో 45, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వార్నర్ కు జతకలిశాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్ కు 28 పరుగులు జతచేశారు. నవీన్ ఉల్ హక్ వేసిన ఆరో ఓవర్ రెండో బంతికి వార్నర్.. స్విచ్ హిట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్ (4) కూడా విఫలమయ్యాడు. 7 ఓవర్లకు ఆసీస్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 55 పరుగులు.
గుల్బాదిన్ వేసిన 9వ ఓవర్లో మిచెల్ మార్ష్.. 6, 4, 4 తో రెచ్చిపోయాడు. కానీ ముజీబ్ వేసిన 11వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన స్టోయినిస్ (25) ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 54 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి ఆసీస్ స్కోరుకు ఊపుతెచ్చాడు. 15 ఓవర్లకు ఆసీస్ స్కోరు.. 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ఈ ఇద్దరి బాదడు చూస్తే ఆసీస్ స్కోరు ఈజీగా రెండు వందలు దాటడం పక్కా అని అనిపించింది.
కానీ అక్కడే ఆసీస్ ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్ తొలిబంతికి భారీ సిక్సర్ బాదిన స్టోయినిస్.. రెండో బంతికి ఔటయ్యాడు. స్టోయినిస్ నిష్క్రమించినా మ్యాక్స్‌వెల్ భారీ షాట్లను ఆడి ఆసీస్ స్కోరును 150 దాటించాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వేడ్.. (8 బంతుల్లో 6)తో పాటు ప్యాట్ కమిన్స్ (0), రిచర్డ్‌సన్ (1) లు దారుణంగా విఫలమయ్యారు.
చివరి ఓవర్లో మ్యాక్సీ ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 27 ఇన్నింగ్స్ ల తర్వాత మ్యాక్స్వెల్ కు ఇదే తలి అర్థ సెంచరీ కావడం గమనార్హం. మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చుకున్న అఫ్గాన్ బైలర్లు.. చివర్లో కట్టుదిట్టంగా బంతులు వేసి ఆసీస్ ను నిలువరించారు. ఫలితంగా ఆసీస్.. చివరి ఐదు ఓవర్లలో 35 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీయగా ఫరూఖీ రెండు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ లకు చెరో వికెట్ దక్కింది.