Asianet News TeluguAsianet News Telugu

భవిష్యత్ అంతా టీ10 ఫార్మాట్ దే.. దీనిని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టాలి.. డూప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Faf Du Plesis: అబుదాబి  వేదికగా నవంబర్ 19 నుంచి డిసెంబర్ 4 దాకా అబుదాబిలో టీ10 టోర్నీ మొదలుకానున్నది. ఈ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు డూప్లెసిస్ తెలిపాడు. 

T10 Format has a Bright Future, can be played at the Olympics, says Faf Du Plesis ahead of abudhabi T10 Tourney
Author
Hyderabad, First Published Nov 10, 2021, 4:38 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఒకప్పుడు క్రికెట్ అంటే టెస్టు క్రికెటే.. ఐదు రోజోల పాటు సాగే ఆ గేమ్ కు ఉండే ఆకర్షణే వేరు. తమ ఆరాధ్య ఆటగాళ్ల ఆటను చూడటానికి ప్రేక్షకులు.. స్టేడియాలకు క్యూ కట్టేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఒక్కరోజు అంతర్జాతీయ మ్యాచులు వచ్చాయి. ఇప్పుడిది టీ20ల యుగం.. ఎక్కడ చూసినా టీ20 ఫీవరే. సుమారు నాలుగు గంటల్లో మ్యాచ్ ముగిసిపోతుంది. అందుకే ఈ ఆటకు క్రేజ్ ఎక్కువగా ఉంది. అయితే  టీ20 క్రికెట్ తో పాటు ఇప్పుడు టీ10 ఫార్మాట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో పలు లీగ్ లు కూడా టీ10 లను నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తులో  పది ఓవర్ల ఆట కూడా  క్రికెట్ ను శాసించబోతుందని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో  దక్షిణాఫ్రికా ఆటగాడు, ఐపీఎల్ లో చెన్నెై సూపర్ కింగ్స్ తరఫున ఇరగదీస్తున్న ఫాఫ్ డూప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అబుదాబి  వేదికగా నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 టోర్నీ మొదలుకానున్నది. డూప్లెసిస్.. తొలిసారి ఈ ఫార్మాట్ లో ఆడబోతున్నాడు. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 4 మధ్య జరిగే ఈ టోర్నీ లో అతడు బంగ్లా టైగర్స్ తరఫున ఆడనున్నాడు. ఈ జట్టుకు అతడే కెప్టెన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డూప్లెసిస్ మాట్లాడాడు. 

భవిత టీ10 దే..

అతడు స్పందిస్తూ.. ‘చాలా కాలంగా నేను మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టీ20) లోనూ ఆడాను. ఈ ఫార్మాట్ (టీ10) కూడా నన్ను ఆకర్షిస్తున్నది. నావంటి ఆటగాళ్లు ఇటువంటి లీగ్ ల కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ10 కి భవిష్యత్తు కూడా బాగానే ఉంది. అసలు ఈ ఫార్మాట్ ను ఒలింపిక్స్ లలో కూడా ప్రవేశపెట్టాలి. త్వరగా ముగిసే ఈ ఫార్మాట్ తో ప్రేక్షకులు ఎక్కువ ఆకర్షితులవుతారు. నా అభిప్రాయం ప్రకారం.. భవిష్యత్తులో టీ10 ఫార్మాట్ మరింత బాగా ఆదరణ పొందుతుంది’ అని తెలిపాడు. 

కాగా.. ఒలింపిక్స్ లో క్రికెట్ ఆడరు. విశ్వ క్రీడల్లో  కూడా క్రికెట్ ను ప్రవేశపెట్టాలని కొంతకాలంగా డిమాండ్ వినిస్తున్నా దాని మీద ఒలింపిక్ అసోసియేషన్  ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇదిలాఉండగా.. 2028 లో లాస్ ఏంజెల్స్ లో జరిగే ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టాలని ఐసీసీ కోరుతున్నది. ఆ మేరకు బిడ్ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. మరి దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పటికైతే సస్పెన్సే. 

పాకిస్థాన్ హాట్ ఫేవరేట్..

ఇదిలాఉండగా.. అబుదాబి పిచ్ లు  స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలిస్తాయని, ఆ మేరకు తమ జట్టు కూర్పు చూసుకోవాలని డూప్లెసిస్ చెప్పాడు. ప్రస్తుతం ఇవే వేదిక (దుబాయ్, షార్జా, అబుదాబి) ల మీద జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అతడు చెప్పాడు. ఇక  టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ హాట్ ఫేవరేట్ అని ఫాఫ్ జోస్యం చెప్పాడు.  ఈసారి ప్రపంచకప్ ను పాకిస్థాన్ సొంతం చేసుకుంటుందని తెలిపాడు. న్యూజిలాండ్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నదని, వాళ్లు కూడా టైటిల్ చేజిక్కించుకునే అవకాశాలు లేకపోలేదని అన్నాడు.  ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించడానిపై స్పందిస్తూ.. తమ జట్టు అద్భుత ప్రదర్శన చేసిందని, బౌలర్లు అద్భుతంగా రాణించారని తెలిపాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios