వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్... మెరుపులు మెరిపించి అవుటైన రాహుల్ త్రిపాఠి, శుబ్‌మన్ గిల్.. 

ఐసీసీ నెం.1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. రెండో టీ20లో హాఫ్ సెంచరీ చేసినా కీలక సమయంలో అవుటైన సూర్య భాయ్, డిసైడర్ టీ20లో హాఫ్ సెంచరీ బాదాడు. సూర్యకి తోడు రాహుల్ త్రిపాఠి మెరుపులు మెరిపించి అవుట్ కావడంతో టీమిండియా మంచి స్కోరు దిశగా పరుగులు పెడుతోంది...

ఇషాన్ కిషన్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. 2 బంతులు ఆడిన ఇషాన్ కిషన్ 1 పరుగు చేసి దిల్షాన్ మదుశంక వేసిన తొలి ఓవర్‌లో పెవిలియన్ చేరాడు. 3 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది టీమిండియా...

వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కరుణరత్నే బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది భారత జట్టు స్కోరు 50 మార్కు దాటించిన రాహుల్ త్రిపాఠి, ఆ తర్వాతి బంతికి మదుశంకకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన రేంజ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో 1500 పరుగులు పూర్తి చేసుకున్నాడు...

సూర్యకుమార్ యాదవ్ 43 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు అందుకోగా విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్, బాబర్ ఆజమ్, కెఎల్ రాహుల్ 39 ఇన్నింగ్స్‌ల్లో మహ్మద్ రిజ్వాన్ 42 ఇన్నింగ్స్‌ల్లో అందుకుని ముందున్నారు..

28 బంతుల్లో 29 పరుగులే చేసిన శుబ్‌మన్ గిల్, క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, వానిందు హసరంగ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్‌కి 111 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు..