సఫారీ బౌలింగ్‌కు భారత బ్యాటర్ల దాసోహం.. సూర్య తప్ప అంతా విఫలం.. సౌతాఫ్రికా ముందు ఈజీ టార్గెట్
T20 World Cup 2022: ఇటీవల కాలంలో భారత జట్టుకు ఆపద్భాంధవుడిలా మారిన మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ టీమిండియాను మరోసారి ఆదుకున్నాడు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి నాలుగు వికెట్లతో చెలరేగాడు.
టీ20 ప్రపంచకప్ లో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు పెర్త్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ దారుణంగా విఫలమయ్యారు. వచ్చినోళ్లు వచ్చినట్టు పెవలియన్ చేరుతున్నా టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (40 బంతుల్లో 68, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి భారత్ ను ఆదుకున్నాడు. అతడు కూడా ఆడకుండా ఉండుంటే భారత జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. సూర్య మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా వెటరన్ పేసర్ లుంగి ఎంగిడి.. నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించింది. వరుసగా రెండు మ్యాచ్ లలో విఫలమైన కెఎల్ రాహుల్.. వేన్ పార్నెల్ వేసిన తొలి ఓవర్లో పరుగులేమీ చేయలేదు. తర్వాత ఓవ్లలో రోహిత్ (15) , రాహుల్ (9) లు చెరో సిక్సర్ కొట్టారు. 4 ఓవర్లకు టీమిండియా స్కోరు వికెట్ నష్టాపోకుండా 21 పరుగులు.
కానీ ఐదో ఓవర్ వేసిన ఎంగిడి టీమిండియాకు డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఆ ఓవర్లో రెండో బంతికి రోహిత్ శర్మ.. ఎంగిడికే క్యాచ్ ఇచ్చాడు. చివరి బంతికి రాహుల్ కూడా స్లిప్స్ లో మార్క్రమ్ కు దొరికిపోయాడు. తొలి పవర్ ప్లేలో భారత స్కోరు 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు మాత్రమే.
పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై వరుస హాఫ్ సెంచరీలతో జోరు మీదున్న కోహ్లీ (12) రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించినా.. ఎంగిడి వేసిన తర్వాత ఏడో ఓవర్లో భారీ షాట్ ఆడబోయి లాంగ్ లెగ్ వద్ద రబాడాకు క్యాచ్ ఇచ్చాడు.
అక్షర్ పటేల్ స్థానంలో ఈ మ్యాచ్ లో ఆడుతున్న దీపక్ హుడా (0) పరుగులేమీ చేయకుండానే నోర్త్జ్ వేసిన 8 ఓవర్ మూడో బంతికి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లు పోతున్నా హార్ధిక్ పాండ్యా (2) ఉన్నాడనే ధైర్యం మీదున్న భారత అభిమానుల ఆశలపై ఎంగిడి మరోసారి నీళ్లు చల్లాడు. అతడు వేసిన 9వ ఓవర్లో మూడో బంతికి రబాడా మరో అద్భుతమైన క్యాచ్ పట్టి అతడిని పెవిలియన్ కు చేర్చాడు.
నిలిచిన సూర్య..
కష్టాల్లో పడ్డ భారత జట్టును సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. దినేశ్ కార్తీక్ (6) తో కలిసి ఆరో వికెట్ కు 52 పరుగులు జోడించాడు. ఇందులో కార్తీక్ చేసినవి ఆరు పరుగులే అంటే సూర్య వికెట్ కాపాడుకోవడంతో పాటు పరుగులు ఎలా సాదించాడో అర్థం చేసుకోవచ్చు. వరుసగా వికెట్లు పడ్డా నిలకడగా ఆడిన సూర్య.. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కుదురుకుంటున్న ఈ జోడీని పార్నెల్ విడదీశాడు. అతడు వేసిన 15వ ఓవర్ తొలి బంతికి కార్తీక్ భారీ షాట్ ఆడబోయి రిలీ రొసో కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత వచ్చిన అశ్విన్ (7) కూడా విఫలమయ్యాడు.
చివరి ఓవర్లలో దాటిగా ఆడే క్రమంలో సూర్య.. పార్నెల్ బౌలిగ్ లో కేశవ్ మహారాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత టీమిండియా మరో ఏడు బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేయగలిగింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసి 29 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. పార్నెల్ 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టాడు. నోర్త్జ్ కు ఒక వికెట్ దక్కింది.