సోనూసూద్... సినిమాల్లో విలనీ వేశాలు వేసే ఈయనకి, ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేసింది. దీనికి కారణం సోషల్ మీడియా ద్వారా కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్నవారికి సోనూ సూద్ ఆదుకుంటున్న తీరే. తాజాగా క్రికెటర్ సురేశ్ రైనాకి కూడా కష్టకాలంలో సాయం అందించాడు సోనూసూద్.

క్రికెటర్ సురేశ్ రైనా, మీరట్‌లో ఉన్న 65 ఏళ్ల తన ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలంటూ ట్వీట్ చేశాడు.  ‘మీరట్‌లో ఉన్న మా ఆంటీకి అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఆమె వయసు 65 ఏళ్లు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పాటు కోవిద్ కూడా ఉంది... దయచేసి సాయం చేయండి’ అంటూ  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిథ్యనాథ్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు క్రికెటర్ సురేశ్ రైనా...

అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించకపోయినా సోనూ సూద్ వెంటనే స్పందించి, వివరాలు పంపాల్సిందిగా సురేశ్ రైనాను కోరారు. సురేశ్ రైనా, అతనికి ధన్యవాదాలు తెలిపి... వివరాలు మెసేజ్ చేశాడు...

మరో పది నిమిషాల్లో ఆక్సిజన్ సిలిండర్ వస్తుందని రిప్లై ఇచ్చిన సోనూ సూద్, తన ఫౌండేషన్ ద్వారా ఆమెకు కావాల్సిన ఏర్పాట్లు చేసేశాడు...  ‘ఆక్సిజన్ సిలిండర్ అందింది. నాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా... అందరూ ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు సురేశ్ రైనా...

ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉందంటూ రూమర్లు క్రియేట్ చేస్తున్నవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించడం విశేషం...