రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి 31 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసిన ఆస్ట్రేలియా... డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఫెయిల్, లబుషేన్ డకౌట్..
యాషెస్ సిరీస్ తొలి టెస్టు మొదటి రోజు పూర్తి ఆధిక్యం కనబర్చిన ఇంగ్లాండ్, రెండో రోజు తొలి సెషన్‌ని కూడా పూర్తిగా డామినేట్ చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 14/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా, లంచ్ బ్రేక్ సమయానికి 31 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది..
తొలి వికెట్‌కి 29 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత డేవిడ్ వార్నర్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. 27 బంతుల్లో 2 ఫోర్లతో 9 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..
టెస్టుల్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ అవుట్ కావడం ఇది 15వ సారి. యాషెస్ సిరీస్‌లో ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ మైఖేల్ అర్థర్‌టన్ 19 సార్లు అవుట్ అయితే అలెక్ బెడ్సర్ బౌలింగ్‌లో ఆర్థర్ మోరిస్ 18 సార్లు అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ - డేవిడ్ వార్నర్ ఉన్నారు...
స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 734 బంతులు ఎదుర్కొన్న డేవిడ్ వార్నర్, 397 పరుగులు చేసి 15 సార్లు అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియాలో 6 సార్లు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో అవుటైన డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్‌లో 9 సార్లు అవుట్ అయ్యాడు..
డేవిడ్ వార్నర్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన తర్వాతి బంతికే మార్నస్ లబుషేన్‌ని గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు స్టువర్ట్ బ్రాడ్. బ్రాడ్ బౌలింగ్‌లో లబుషేన్ బ్యాటుని తాకుతు వెళ్లిన బంతి, స్లిప్‌లో జానీ బెయిర్‌స్టో చేతుల్లో పడింది.
టెస్టుల్లో నెం.1 బ్యాటర్‌గా ఉన్న మార్నస్ లబుషేన్‌కి ఇది మొట్టమొదటి గోల్డెన్ డకౌట్. ఆస్ట్రేలియా గడ్డ మీద 9 సెంచరీలతో 70.50 సగటుతో పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, విదేశాల్లో మాత్రం ఒకే ఒక్క సెంచరీ సాధించాడు. విదేశాల్లో లబుషేన్ యావరేజ్ 38 మాత్రమే..
ఈ ఇద్దరూ అవుటైన తర్వాత స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా కలిసి మూడో వికెట్‌కి 16.4 ఓవర్లలో 38 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 59 బంతుల్లో 16 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు..
ఓపెనర్‌గా వచ్చిన ఉస్మాన్ ఖవాజా 92 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఆస్ట్రేలియా ఇంకా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 315 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, మొదటి రోజు 78 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 393 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే...
టెస్టు కెరీర్‌లో 30వ సెంచరీ అందుకున్న జో రూట్, ప్రస్తుత తరంలో స్టీవ్ స్మిత్ (31 టెస్టు సెంచరీలు) తర్వాత అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా తన రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు.
