బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ వివాదాలకు కేంద్ర బిందువగా మారింది. టీమిండియా క్రికెటర్లు మహమ్మద్ సిరాజ్, బుమ్రాలను కొందరు ఆసీస్ అభిమానులు జాతి వ్యతిరేక వ్యాఖ్యలతో టార్గెట్ చేశారు.

నాలుగు రోజుల పాటు పేపర్లలో దీనిపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటిని తోసిరాజని.. ఆసీస్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వ్యవహారం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. 

గత రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ గురించే వార్తలు వస్తున్నాయి. డ్రింక్స్‌ బ్రేక్‌లో రిషభ్‌ పంత్ గార్డ్‌ మార్క్‌ను దురుద్దేశంతో చెరిపివేశాడని అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి.

బాల్‌టాంపరింగ్‌తో ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైనా ఇంకా మారలేదంటూ నెటిజన్లు మండిపడ్డారు. మాజీ క్రికెటర్లు సెహ్వాగ్‌, మైకేల్ వాన్ మాజీలు కూడా స్మిత్‌ తీరును తప్పుబట్టారు. కానీ తానెలాంటి తప్పు చేయలేదని స్మిత్‌ సమర్ధించుకున్నాడు.

Also Read:అలా చేసినందుకు సారీ... స్టీవ్ స్మిత్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు... ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్...

అయితే ఈ వివాదానికి సంబంధించిన తాజాగా మరో వీడియో వైరల్‌గా మారింది. దానిని చూసిన వారు స్మిత్‌ది దురుద్దేశం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత వీడియోలో.. స్మిత్ క్రీజు వద్దకు వచ్చి పంత్ గార్డ్‌ మార్క్‌ను చెరిపివేస్తున్నది మాత్రమే కనిపించింది. కానీ తాజా వీడియోలో అసలు దాని కంటే ముందు ఏం జరిగిందనే విషయం వెల్లడైంది.  

డ్రింక్స్‌ బ్రేక్‌లో మైదాన సిబ్బంది పిచ్‌ను శుభ్రం చేయడానికి వచ్చారు. బ్రష్‌తో క్రీజును శుభ్రం చేశారు. ఆ తర్వాత పెయింట్‌తో క్రీజు మార్క్‌ గీశారు. సిబ్బంది శుభ్రం చేసినప్పుడే అక్కడ ఉన్న గ్రేడ్‌ మార్క్‌లు తొలగిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది.

దీంతో స్మిత్ తప్పు చేయలేదని భావిస్తున్నారు. మరి ఈ వివాదానికి తాజా వీడియోతో ముగింపు పడుతుందా లేక స్మిత్‌కు మరో తలనొప్పి మొదలవుతుందో వేచి చూడాలి.