Asianet News TeluguAsianet News Telugu

బ్యాన్ పడిన అతనికే మళ్లీ కెప్టెన్సీ... స్టీవ్ స్మిత్‌కే పగ్గాలు అప్పగించాలని చూస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా..

సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కుని టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన టిమ్ పైన్... ఆస్ట్రేలియా కొత్త టెస్టు కెప్టెన్ రేసులో స్టీవ్ స్మిత్, ప్యాట్ కమ్మిన్స్...

Steve Smith in Cricket Australia Test captaincy race along with star pacer Pat Cummins
Author
India, First Published Nov 21, 2021, 3:47 PM IST

ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా ప్లేసే వేరు. ఆస్ట్రేలియాతో ఆడాలంటే ఎలాంటి దేశమైనా భయపడేది, ఓడిపోవడం ఖాయమని ఫిక్స్ అయి బరిలో దిగింది. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. దీనికి తోడు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును వివాదాలు కూడా వెంటాడుతున్నాయి... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ టైటిల్ గెలిచామని సంబరాలు చేసుకునే లోపు, ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్, సెక్స్ స్కాంలో ఇరుక్కువడంతో ఇప్పుడు కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేసే పనిలో పడింది క్రికెట్ ఆస్ట్రేలియా..

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ టెస్టు కెప్టెన్సీ రేసులో ఉన్నా, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కి తిరిగి కెప్టెన్సీ అప్పగిస్తే ఎలా ఉంటుందనే కోణంలో కూడా ఆలోచిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా... ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ రిటైర్మెంట్ తర్వాత అతని నుంచి పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా స్టీవ్ స్మిత్ బాధ్యతలు తీసుకున్నాడు. బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది ఆస్ట్రేలియా...

స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో 34 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా, 18 మ్యాచుల్లో విజయాన్ని అందుకుని, 10 మ్యాచుల్లో ఓడింది. 6 టెస్టులు డ్రాగా ముగిశాయి. అలాగే 51 వన్డేల్లో 25 విజయాలు అందుకున్న స్టీవ్ స్మిత్, 8 టీ20 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్నాడు.

ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను భూకంపం తీసుకొచ్చింది ‘సాండ్ పేపర్’ వివాదం. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ సమయంలో జేబుల్లో సాండ్ పేపర్ పెట్టుకుని, బాల్ టాంపరింగ్ చేయడానికి ప్రయత్నించి, అడ్డంగా దొరికిపోయారు ఆస్ట్రేలియా క్రికెటర్లు. ఈ ఎపిసోడ్ అంతటికీ ప్రధాన సూత్రధారుడిగా వ్యవహరించిన అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లపై ఏడాది నిషేధం కూడా పడింది. అలాగే వికెట్ కీపర్ కామెరాన్ బాంక్రాఫ్ట్‌పై కూడా ఏడాది విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా...

ఈ సంఘటన ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు క్రియేట్ చేసింది. సాండ్ పేపర్ వాడి బాల్ ట్యాంపరింగ్‌కి ప్రయత్నించిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను జైలు శిక్ష పడిన ఖైదీల్లా పోలీసుల లాక్కుంటూ తీసుకురావడం చూసి, క్రికెట్ ఫ్యాన్స్ అవాక్కయ్యారు. 2018లో జరిగిన ఈ సంఘటన తర్వాత ఆస్ట్రేలియా ఆధిక్యానికి కూడా తెర పడినట్టైంది.

అప్పటిదాకా క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా, ప్రత్యర్థులను వణికిస్తూ వచ్చిన ఆస్ట్రేలియా... ఈ సంఘటన తర్వాత సరైన విజయాలు అందుకోలేకపోతోంది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల గైర్హజరీతో ఆస్ట్రేలియా టీమ్‌ను 2-1 తేడాతో ఓడించి టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న విరాట్ సేన, 2020-21 టూర్‌లో ఈ ఇద్దరూ టీమ్‌లో ఉండగానే 2-1 తేడాతో టెస్టు సరీస్ గెలిచింది. 

తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న టిమ్ పైన్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా సరైన విజయాలు అందుకోవడానికి కష్టపడుతుండడంతో మళ్లీ స్టీవ్ స్మిత్‌కే కెప్టెన్సీ పగ్గాలు అందించాలని చూస్తోంది సీఏ (క్రికెట్ ఆస్ట్రేలియా). 

ఒకవేళ స్టీవ్ స్మిత్ టెస్టు కెప్టెన్సీ తీసుకోవడానికి అంగీకరించకపోతే, స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్‌ని కెప్టెన్‌గా నియమించి, స్మిత్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించాలని చూస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. టీ20ల్లో వరుసగా ఐదు టీ20 సిరీస్‌లు ఓడిన ఆస్ట్రేలియా, అదృష్టం కలిసి వచ్చి, న్యూజిలాండ్‌ బ్యాడ్ లక్ కూడా తోడు కావడంతో టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీ సొంతం చేసుకోగలిగింది.

చివరిగా 2017-18 సీజన్‌లో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టును 4-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి టెస్టు సిరీస్ సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. గత సీజన్‌లో జరిగిన యాషెస్ సిరీస్ 2-2 తేడాతో డ్రాగా ముగిసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios