ఐపీఎల్‌లో భాగంగా బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన మజాను అందించింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో రాయల్ ఛాలెంజర్స్.. సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించింది.

చివరి ఓవర్‌లో 26 పరుగులు అవసరమైన దశలో ధోని 24 పరుగులు చేయడం... చివరి బంతికి శార్ధూల్ ఠాకూర్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. అయితే 19వ ఓవర్‌లో మూడు సార్లు సింగిల్ తీసే అవకాశం వచ్చినా ధోని తిరస్కరించడం.. విధ్వంసక ఆటగాడైన బ్రావోకి అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు మహీపై మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు. లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి ఉంటుందని.. కొత్తగా వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చి రావడంతోనే బౌండరీలు బాదడం సులభం కాదన్నాడు.

ఆ సమయంలో నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న బ్రావో ఎన్నో మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. అయితే ఆ సమయంలో అతను పెద్ద షాట్లు ఆడే పరిస్థితి లేదు.. అందుకే ఆ బాధ్యతను ధోని తన భుజాలపై వేసుకున్నాడని ఫ్లెమింగ్ తెలిపాడు.

ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లలో ధోని ఎన్నో విజయాలు అందించాడు.. కాబట్టి సింగిల్స్ విషయంలో ధోనిని తాము ప్రశ్నించదలచుకోలేదని ఫ్లెమింగ్ తెలిపాడు.