బంతి బంతికి ఉత్కంఠను రేపుతూ... అందరిని అందులో లీనమయిపోయేలా చేయగల ఆటల్లో క్రికెట్ ఒకటి అనడంలో ఎటువంటి సంశయం లేదు. నరాలు తెగే టెన్షన్ నెక్స్ట్ ఏమవుతుందో అన్న ఆతృత ఇవన్నీ వెరసి అత్యధికమంది అభిమానులను సంపాదించుకున్న ఆట క్రికెట్. 

Also read: భారతీయ యువతితో ఆసిస్ క్రికెటర్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్మెంట్

చూసే సగటు అభిమానులకే ఇలా ఉంటే... ఆడే ఆటగాళ్ల పరిస్థితి గురించి వేరుగా చెప్పనవసరం లేదు. క్రికెట్ ఆటగాళ్లు ఎంతలా వేడెక్కిపోయి ఉంటారో వేరుగా చెప్పనవసరం లేదు. వారు అందులో లీనమయిపోయినప్పుడు వారి ఒంట్లో కాక పుడుతుందని మనం ఏదో మాటవరసకు అంటుంటాము. కానీ నిజంగా అలా వేడెక్కి వంటిలొంచి పొగలు వస్తే....!

అవునండి నిజంగా ఇలాంటి సంఘటనే క్రికెట్లో చోటు చేసుకుంది. భారీ లక్ష్య ఛేదనలో తాను కీలకం అని భావించిన ఒక ఆటగాడు అదే రీతిలో ఆడుతూ ఒక్కసారిగా అవుట్ అయ్యాడు. ఆ ఆటగాడు మైదానాన్ని వీడుతున్నప్పుడు హెల్మెట్ తీస్తుంటే పొగలు రావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. 

వివరాల్లోకి వెళితే... ఆస్ట్రేలియా ఆటగాడు క్రిస్ లిన్ పాకిస్తాన్ దేశవాళీ టి 20 టోర్నమెంటులో లాహోర్ కలందర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన జట్టు ముందున్న భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో అప్పటికే 15 బంతుల్లో 30 పరుగులు కొట్టి జోరుమీదున్న లిన్.... మరో భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు.

మైదానాన్ని వీడుతూ... హెల్మెట్ తీస్తుంటే అతని తలపై నుంచి పొగలు రావడం అభిమానుల కంటపడింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. అభిమానులంతా ఆ వీడియో చూసి రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఆట మీద మక్కువ అంటే... మరొకరేమో ఎంత టెన్షన్ అంటున్నారు.