Bhanuka Rajapaksa Withdraw Retirement: రాజపక్స రిటైర్మెంట్ లేఖ శ్రీలంక క్రికెట్ లో పెద్ద దుమారమే రేపింది. 30 ఏండ్ల వయసులోనే అతడి వీడ్కోలు ప్రతిపాదనపై లంక  క్రికెట్ పెద్దలే గాక మాజీ ఆటగాళ్లు, సీనియర్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కానీ..

శ్రీలంక క్రికెట్ లో చర్చనీయాంశమైన ఆ జట్టు బ్యాటర్ భానుక రాజపక్స రిటైర్మెంట్ వివాదం సద్దుమణిగింది. రిటైర్మెంట్ ను వెనక్కితీసుకుంటున్నట్టు రాజపక్స ప్రకటించాడు. తాను జట్టుతో కొనసాగుతానని ప్రకటించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రెండు వారాల క్రితమే అతడు.. శ్రీలంక క్రికెట్ తీసుకొచ్చిన కొత్త ఫిట్నెస్ రూల్స్ ను నిరసిస్తూ రిటైర్మెంట్ అవుతానని బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. 

కాగా, రాజపక్స లేఖ శ్రీలంక క్రికెట్ లో పెద్ద దుమారమే రేపింది. 30 ఏండ్ల వయసులోనే అతడి రిటైర్మెంట్ ప్రతిపాదనపై లంక క్రికెట్ పెద్దలే గాక మాజీ ఆటగాళ్లు, సీనియర్లు కూడా ఈ నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తు ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ను రిటైర్మెంట్ నిర్ణయం పై పునరాలోచించాలని మాజీ పేసర్ లసిత్ మలింగతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

Scroll to load tweet…

ఇదిలాఉండగా.. రాజపక్స రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది రోజులకే మరో శ్రీలంక క్రికెటర్ దనుష్క రాజపక్స కూడా వీడ్కోలు ప్రకటించాడు. అతడి వయసు కూడా ముప్పై ఏండ్లే. అయితే దనుష్క.. తాను టెస్టుల నుంచి వైదొలుగుతానని, పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడతానని ప్రకటించాడు.

దీంతో అప్రమత్తమైన లంక క్రికెట్ బోర్డు పెద్దలు.. రాజపక్సతో మాట్లాడారు. కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స కూడా భానుక తో సమావేశమై చర్చించాడు. ఫిట్నెస్ రూల్స్ కు సంబంధించి అతడు మంత్రి దగ్గర లేవనెత్తగా తాను బోర్డుతో చర్చిస్తానని హామీ ఇవ్వడంతో భానుక తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. 

Scroll to load tweet…

ఇవే ఆ కొత్త నిబంధనలు : 

గతేడాది ముగింపులో శ్రీలంక క్రికెట్ కొత్త ఫిట్నెస్ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆటగాళ్లకు కొన్ని ఫిట్నెస్ టెస్టులను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. జట్టులో ఉన్న ప్రతి ఆటగాడు 8.10 నిమిషాలలో రెండు కిలోమీటర్లు పరుగెత్తాలి. ఒకవేళ 8.35 నిమిషాల నుంచి 8.55 నిమిషాల మధ్య రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తితే ఆటగాళ్ల వేతనాల్లో కోత పెట్టనున్నారు. ఎంతమేర కోత విధిస్తారన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీంతోపాటు ప్రతి నెలా స్కిన్ టెస్టు నిర్వహించనున్నారు. ఇది బాడీ ఫ్యాట్ ను కొలిచే ఓ పరీక్ష. ఒక పరికరం ద్వారా శరీరంలోని కొవ్వును కొలుస్తారు. స్కిన్ ఫోల్డ్ టెస్టులో 70-85 కంటే తక్కువ ఉన్నవారినే తుది జట్టులో ఉంచుతారు.