స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సీరిస్ ను శ్రీలంక కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆనందంలో మైదానంలోనే సంబరాలు చేసుకుంటున్న లంక క్రికెటర్లు కొందరు ప్రమాదానికి గురయ్యారు. చాలాకాలం తర్వాత ఓ సీరీస్ ను క్లీస్ స్వీప్ చేసిన ఆనందంలో కుశాల్ మెండిస్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. మైదానంలోనే బైక్ ను వేగంగా నడుపుతూ ప్రమాదానికి  కారణమయ్యాడు.

మెండిస్ తన సహచర క్రికెటర్ ను బైక్ పై ఎక్కించుకుని ప్రేమదాస స్టేడియంలో చక్కర్లు కొట్టాడు. అయితే ఇదే సమయంలో వేగంగా వెళుతున్న వాహనం  అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో మెండిస్ తో పాటు బైక్ పై వున్న మరో ఆటగాడికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వెంటనే శ్రీలంక టీం వైద్యులు వారికి అక్కడే ప్రథమ చికిత్స చేశారు. మెండిస్ తో పాటు బైక్ ప్రమాదానికి గురయిన మరో ఆటగాడు కూడా ప్రస్తుతం క్షేమంగా వున్నట్లు శ్రీలంక టీం మేనేజ్ మెంట్ తెలిపింది. 

టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని చాలాసార్లు ఇలా మైదానంలోనే బైక్ రైడింగ్ చేశాడు. కానీ ఒక్కసారి కూడా ఇలా ప్రమాదాల బారిన పడలేదు. అలా ధోని స్టైల్లో సంబరాలు చేసుకోవాలని ప్రయత్నించి మెండిస్ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఏదేమైనా ఈ బైక్ ప్రమాదంలో మెండిస్ సురక్షితంగా బయటపడంతో లంక అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగిన వన్డే సీరీస్ ను లంక 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మొదటి వన్డేలో 91 పరుగులు, రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బుధవారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో 122 పరుగుల భారీ తేడాతో గెలిచి సీరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సీరీస్ లో మెండిస్ కూడా  బాగా ఆడాడు.