India vs Sri Lanka 2nd test: డీఆర్‌ఎస్ నిర్ణయాలు తీసుకునే విషయంలో శ్రీలంక తప్పుల మీద తప్పులు... లంక తప్పుడు నిర్ణయాల కారణంగా బతికిపోయిన హనుమ విహారి, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్... 

శ్రీలంక... ఒకప్పుడు టీమిండియాకి సమానంగా ప్రపంచ క్రికెట్‌లో దూసుకుపోయిన జట్టు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మూడు సార్లు ఫైనల్ చేరిన శ్రీలంక, ఓ సారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో టాప్ టీమ్స్‌ని ఓడించి ఫైనల్ చేరింది. 

మహేల జయవర్థనే, సనత్ జయసూర్య, కుమార సంగర్కర, లసిత్ మలింగ, ముత్తయ్య మురళీధరన్ వంటి లెజెండరీ క్రికెటర్లు ఉన్న సమయంలో టెస్టుల్లోనూ టాప్ టీమ్‌గా కొనసాగిన శ్రీలంక జట్టు... ఇప్పుడు అనుభవ లేమితో సరైన విజయాలు అందుకోవడానికి ఆపసోపాలు పడుతోంది...

టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్ సేన జోరు ముందు కనీస పోరాటం చూపించలేకపోయిన శ్రీలంక జట్టు... టెస్టుల్లోనూ పూర్తిగా తేలిపోయింది. మొహాలీ టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసిన శ్రీలంక జట్టు, బెంగళూరులో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో మొదటి రోజు మంచి ఆధిక్యాన్ని చూపించింది. బౌలర్లకు చక్కగా సహకరిస్తున్న పిచ్‌లో టీమిండియాని రెండు సెషన్లలోనే ఆలౌట్ చేయగలిగింది...

అయితే బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేక 109 పరుగులకే ఆలౌట్ అయిన శ్రీలంక జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతుంటే తీవ్రమైన ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది.

ఈ ఒత్తిడి కారణంగానే డీఆర్‌ఎస్ తీసుకునే విషయంలో శ్రీలంక నిర్ణయాలు, భారత జట్టుకి అద్భుతంగా కలిసి వచ్చాయి. శ్రీలంక బౌలర్లు అప్పీలు చేసినా, డీఆర్‌ఎస్ తీసుకోకుండా వదిలేసిన సందర్భాలు... ఏకంగా ఐదుసార్లు బ్యాటర్ క్లియర్‌గా అవుటైనట్టు టీవీ రిప్లైలో కనిపించింది...

ఈ కారణంగానే భారత బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, హనుమ విహారి, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్... అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డీఆర్‌ఎస్ తీసుకోకుండా వదిలేసిన సందర్భాల్లో టీవీల్లో అవుటైనట్టు కనిపించడంతో ఆ తర్వాత ఆవేశానికి, ఒత్తిడికి లోనైన లంక ప్లేయర్లు... వరుస విరామాల్లో డీఆర్‌ఎస్ రివ్యూలు ఉపయోగించుకుని, వృథా చేసుకుంది...

40వ ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్‌ ఎల్బీడబ్ల్యూ కోసం డీఆర్‌ఎస్ కోరుకున్న శ్రీలంక జట్టు, ఆ తర్వాతి ఓవర్‌లోనే రిషబ్ పంత్‌ కోసం మరోసారి రివ్యూ తీసుకోవడం విశేషం. మొత్తంగా శ్రీలంక జట్టులో అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తోంది...

ఈ అనుభవ లేమి కారణంగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు, గ్రూప్ క్వాలిఫైయర్స్‌లో నమీబియా, స్కాట్లాండ్, యూఏఈ, ఐర్లాండ్ వంటి అసోసియేట్ జట్లతో పోటీ పడాల్సిన పరిస్థితులలో పడింది.. టీమిండియాతో సిరీస్‌లో శ్రీలంక ఆటతీరు చూస్తుంటే, అసోసియేట్ టీమ్‌లానే అనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు... 

డీఆర్‌ఎస్ తీసుకోవడంలో శ్రీలంక జట్టు చేస్తున్న తప్పులకు తోడు గాయాల కారణంగా కీలక ప్లేయర్లు దూరం కావడం భారత జట్టుకి బాగా కలిసి వచ్చింది. పసికూనల్లా మారిన టీమ్‌పై మొహాలీ టెస్టులో రవీంద్ర జడేజా విశ్వరూపం చూపించగా... రెండో టెస్టులో రిషబ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీతో 40 ఏళ్ల నాటి కపిల్ దేవ్ టెస్టు ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును బ్రేక్ చేసేశాడు...