Sri Lanka Economic Crisis: నెల రోజులుగా లంకలో నెలకొన్న పరిస్థితులు తాజాగా తారాస్థాయికి చేరాయి. అధ్యక్షుడు గొటబాయ ఎమర్జెన్సీ ప్రకటించడం.. దేశం నాలుగు రోజుల నుంచి రావణకాష్టంలా రగులుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు స్పందించారు.
శ్రీలంకలో తాజా పరిణామాలపై ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి మీరే కారణమంటూ రాజపక్సలను ఆడిపోసుకున్నారు. కొలంబోలోని మాజీ ప్రధాని మహింద రాజపక్స నివాసం ముందు నిరసన చేస్తున్న నిరసనకారులపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడం.. దేశవ్యాప్తంగా రావణ కాష్టంలా రగులుతుండటంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు సనత్ జయసూర్య, ప్రస్తుత ముంబై ఇండియన్స్ కోచ్ మహేళ జయవర్దెన, రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార సంగక్కర లతో పాటు సీనియర్ క్రికెటర్ మాథ్యులో ఏంజెస్, ఆర్సీబీ స్పిన్నర్ వనిందు హసరంగ లు ట్విటర్ వేదికగా స్పందించారు.
ఈ నేపథ్యంలో జయసూర్య స్పందిస్తూ.. ‘అమాయకులైన నిరసనకారులపై ప్రభుత్వం గూండాలు, దుండగులు ఇలా దాడులకు దిగడం హేయమైన చర్య. పోలీసులు కూడా ప్రజలపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. పోలీసులున్నది ప్రజలను రక్షించడానికే అని గుర్తుంచుకోవాలి. అవినీతిపరులైన రాజకీయ నాయకుల కొమ్ము కాయడానికి కాదు. ఇది రాజపక్సేల అంతం..’ అని ట్వీట్ చేశాడు.
ఇదే విషయమై మహేళ జయవర్దెన స్పందిస్తూ.. ‘మనమందరం కోరుకునే మార్పు హింస ద్వారా సాధించలేం. గత 30 రోజులుగా చూపిన క్రమశిక్షణను ఇప్పుడూ కొనసాగించండి. ఈ పోరాటాన్ని దయచేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలిచేయొద్దు’ అని ట్వీట్ చేశాడు. అంతేగాక తమ ప్రాథమిక హక్కులు, అవసరాల కోసం శాంతియుతంగా డిమాండ్ చేస్తున్న ప్రజలపై ప్రభుత్వ మద్ధతుతో దుండగులు, గూండాలు (రాజపక్స మద్దతుదారులను ఉద్దేశిస్తూ) ఇలా చెలరేగిపోతుంటే అది చూడటం అసహ్యంగా ఉందని చెప్పుకొచ్చాడు. నిరసనకారులను ప్రభుత్వ మద్దతుదారులు కొడుతుంటే అక్కడే ఉండి మిన్నకుండిపోయిన పోలీసుల వైఖరిని ప్రశ్నించాడు.
ఇక కుమార సంగక్కర స్పందిస్తూ.. ‘దేశంలో హింసను ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వమే. తన మద్దతుదారులతో అమాయక నిరసనకారుల మీదకు ఉసిగొల్పుతూ శాంతిని భగ్నం చేస్తున్నది..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
వనిందు హసరంగ స్పందిస్తూ.. అమాయక, శాంతియుత నిరసనకారులపై ఇలా దాడులకు దిగడం అనాగరిక చర్య అని మండిపడ్డాడు. ఏంజెలో మాథ్యూస్.. ‘ఇది ప్రజాస్వామ్యం కాదు. నిరసనకారులపై జరిగిన మూకదాడి ముందే ప్లాన్ చేసింది. ప్రభుత్వ గూండాలే దీనిని నడిపిస్తున్నారు. పోలీసులూ.. మీరు ఎక్కడ..? లంక చరిత్రలో ఈ రోజు మాయని మచ్చ..’అని ట్వీట్ చేశాడు.
దేశంలో గత నాలుగు రోజులుగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఘర్షణ వాతావారణం నెలకొంది. ఈ ఘర్షణల్లో పలువురు నిరసనకారులు మరణించడం.. వేల మందికి గాయాలు.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ సాకుతో పోలీసులు ప్రభుత్వ వ్యతిరేకవాదులపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.
