పీకల దాకా మందు కొట్టి యాక్సిడెంట్ చేసిన కేసులో శ్రీలంక టెస్ట్ క్రికెట్ కెప్టెన్ దిముత్ కరుణరత్నెను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫూటుగా మద్యం తాగిన కరుణరత్నె ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో కొలంబోలో ఓ వాహనాన్ని ఢీకొట్టాడు.

దీంతో సదరు వాహనం డ్రైవర్‌కు గాయాలయ్యాయి. కరుణ రత్నెను పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యాడు. వారం రోజుల్లో పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచనున్నారు.

న్యాయస్థానంలో నేరం రుజువైతే కరుణరత్నె కెరీర్‌పై పెను ప్రభావం పడే అవకాశం ఉంది. అతని కెప్టెన్సీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో జట్టు అనూహ్య విజయాన్ని సాధించింది.

కరుణరత్నె నాయకత్వ లక్షణాలు గుర్తించిన లంక క్రికెట్ బోర్డు వన్డే క్రికెట్‌ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతనికి అప్పగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.