కరోనా వైరస్‌ మహమ్మారి సమయంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో క్రికెట్‌ సర్క్యూట్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతోపాటుగా, క్రికెట్ అభిమానులందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. 

శ్రీలంక మాజీ మంత్రి చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు అన్నీకూడా పసలేనివిగా తేలిపోయాయి. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత జట్టు విజయాన్ని శ్రీలంక ఆటగాళ్లు, సెలక్షన్‌ కమిటీ సహకరించాయని అప్పటి శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మహిదానంద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

కేబినెట్‌ మంత్రి ఆరోపణలు చేయటంతో శ్రీలంక పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు కీలక వ్యక్తులను గంటలకొద్ది విచారణ చేశారు. 

2011 వరల్డ్‌కప్‌ సమయంలో సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అరవింద డిసిల్వను పది గంటల పాటు దర్యాప్తు బృందం విచారణ చేసింది. వరల్డ్‌కప్‌ ఫైనల్లో 30 బంతుల్లో 2 పరుగులే చేసిన ఓపెనర్‌ ఉపుల్‌ తరంగను, కెప్టెన్‌ కుమార సంగక్కరలపై దర్యాప్తు బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. 

శుక్రవారం అప్పటి వైస్‌ కెప్టెన్‌ మహేళ జయవర్ధనె విచారణకు హాజరు కావాలి. దర్యాప్తు బృందం ముందు వాగ్మూలం ఇచ్చేందుకు జయవర్దనె వచ్చినా.. విచారణకు పోలీసులు నిరాకరిం చారు. అవినీతి ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని, ఇక ఈ కేసులో విచారణ చేసేందుకు ఏమీ లేదని, 

దర్యాప్తును ముగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో తుది జట్టులో శ్రీలంక నాలుగు మార్పులు చేసింది. ఈ నాలుగు మార్పులకు కమిటీ ముందు హాజరైన అందరూ సహేతుక కారణాలే చెప్పారని, అంతకుమించి ఎటువంటి ఇతర కోణాలు కనిపించటం లేదని దర్యాప్తు బృందం కేసును మూసివేస్తున్నట్టు వెల్లడించింది.

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) సైతం 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగలేదని తెలిపింది. ఈ మేరకు ఐసీసీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌పై వచ్చిన ఆరోపణలను ఐసీసీ అవినీతి నిరోధక విభాగం పరిశీలించిందని, ఆరోపణలను బలపరిచేందుకు ఎటువంటి ఆధారాలు లేవని, ఐసీసీ ఈ ఆరోపణలపై ఎటువంటి విచారణ కమిటీ నియమించటం లేదని ఐసీసీ ప్రకటించింది.