క్వాలిఫై గండం దాటిన లంక.. నెదర్లాండ్స్‌పై విజయంతో సూపర్-12కు..

T20 World Cup 2022: ఇటీవలే ఆసియా కప్  నెగ్గిన శ్రీలంక టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించింది.   తొలి మ్యాచ్ లో నమీబియా చేతిలో ఓడినా తర్వాత పుంజుకుని వరుసగా రెండు విజయాలతో సూపర్-12 బెర్త్ ఖాయం చేసుకుంది. 

Sri Lanka Beats Netherlands By  16 Runs, Seals Super 12 Berth in T20 World Cup 2022

నమీబియాతో తొలి మ్యాచ్ లో ఓడి  మెగా టోర్నీకి క్వాలిఫై అవుతుందా..? అనే భయాల నడుమ తర్వాత మ్యాచ్ ఆడిన శ్రీలంక.. తర్వాత రెండు మ్యాచ్ లను  పట్టుదలతో ఆడి  విజయాల బాట పట్టింది. రెండ్రోజుల క్రితం యూఏఈని ఓడించిన శ్రీలంక.. తాజాగా నెదర్లాండ్స్ నూ ఓడించి సూపర్-12 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.  గురువారం నెదర్లాండ్స్ తో ముగిసిన మ్యాచ్ లో శ్రీలంక.. 16 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్-ఏ లో రెండు విజయాలతో టాప్ లో నిలవడమే గాక సూపర్ -12కు అర్హత సాధించింది.  

జీలాంగ్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో  టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. లంక ఓపెనర్ కుశాల్ మెండిస్.. 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. 

కుశాల్ తో పాటు  చరిత్ అసలంక.. 30 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 31 పరుగులు  చేశాడు.  లంక ప్రధాన బ్యాటర్లైన  పతుమ్ నిస్సంక (14), భానుక రాజపక్స (19), కెప్టెన్ దనుస్ శనక (8 లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. 

మెస్తారు లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఆ జట్టు ఓపెనర్ మాక్స్ ఓడౌడ్.. 53 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. విజయం కోసం  చివరి వరకు పోరాడినా అతడికి సాయం అందించే ఆటగాళ్లు లేకపోవడంతో  నెదర్లాండ్స్ కు ఓటమి తప్పలేదు.  విక్రమ్ జీత్ సింగ్ (7), బస్ డె లీడె (14), కొలిన్ (0), టామ్ కూపర్ (16)లతో పాటు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (21) కూడా విఫలమయ్యారు.  

లంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హసరంగ మూడు వికెట్లతో చెలరేగగా.. మహేశ్ తీక్షణకు రెండు వికెట్లు దక్కాయి.  లాహిరు కుమార, బినుర ఫెర్నాండోలకు చెరో వికెట్ దక్కింది. 

 

ఈ విజయంతో లంక.. గ్రూప్-ఏలో 3 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలతో  సూపర్-12 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. నెదర్లాండ్స్.. 3 మ్యాచ్ లలో రెండు విజయాలు, ఒక ఓటమితో  రెండో స్థానంలో ఉంది.  నమీబియా రెండు మ్యాచ్ లు ఆడి.. 1 విజయం ఒక ఓటమితో  మూడో స్థానంలో ఉంది.  అయితే ఆ జట్టు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.  ఆ మ్యాచ్ లో గెలిస్తే నమీబియా, నెదర్లాండ్స్ మధ్య పోటీ ఉంటుంది.  ఇరు జట్లకు నాలుగు పాయింట్లు సమానంగా ఉంటే  అప్పుడు నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది.  ప్రస్తుతానికి  నెట రన్ రేట్ విషయంలో  నమీబియా (+1.277), నెదర్లాండ్స్ (-0.162) కంటే మెరుగ్గా ఉంది. తర్వాత మ్యాచ్ లో  నమీబియా.. యూఏఈపై  సాధారణ విజయం సాధించినా నెదర్లాండ్స్ కు కష్టమే.  ఓడితే మాత్రం నమీబియా  టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios