Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘాన్‌పై రివెంజ్ తీర్చుకున్న శ్రీలంక... భారీ టార్గెట్‌ని ఊదిపారేసి, సూపర్ 4లో బోణీ...

Sri Lanka vs Afghanistan: 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన శ్రీలంక... ఆసియా కప్ 2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న శ్రీలంక...

Sri Lanka beats Afghanistan in Asia Cup 2022 Super 4 round, takes revenge for 1st match loss
Author
First Published Sep 3, 2022, 11:17 PM IST

ఆసియా కప్ 2022 గ్రూప్ స్టేజీలో ఆఫ్ఘాన్‌ చేతుల్లో ఎదురైన పరాభవానికి, సూపర్ 4 రౌండ్‌లో ప్రతీకారం తీర్చుకుంది శ్రీలంక. ఆఫ్ఘాన్ విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది లంక జట్టు. లంక ఓపెనర్లు కుషాల్ మెండిస్, పాథుమ్ నిశ్శంక కలిసి తొలి వికెట్‌కి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన కుషాల్ మెండిస్‌ని నవీన్ వుల్ హక్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 28 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 35 పరుగులు చేసిన పాథుమ్ నిశ్శంక, ముజీబ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 14 బంతుల్లో 8 పరుగులు చేసిన చరిత్ అసలంకని మహ్మద్ నబీ క్లీన్ బౌల్డ్ చేశాడు. 62/0 స్కోరుతో ఉన్న శ్రీలంక, వరుస వికెట్లు కోల్పోయి 94/3కి చేరుకుంది. 

దనుష్క గుణతిలక 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా కెప్టెన్ ధసున్ శనక 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. భనుక రాజపక్ష 14 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేసి అవుట్ కాగా వానిందు హసరంగ 9 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు, చమికా కరుణరత్నే 5 పరుగులు చేసి లాంఛనాన్ని ముగించారు. ఫీల్డింగ్‌లో సులువైన క్యాచులను జారవిడిచిన ఆఫ్ఘాన్, భారీ మూల్యం చెల్లించుకుంది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఫ్ఘాన్ వికెట్ కీపర్ రెహ్మనుల్లా గుర్భాజ్ మొదటి ఓవర్ నుంచి దూకుడుగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది... 5 ఓవర్లు ముగిసే సమయానికే 46 పరుగులు చేసింది ఆఫ్ఘాన్... 

16 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసిన హజ్రతుల్లా జజాయిని అవుట్ చేసిన దిల్షాన్ మదుశనక, లంకకి తొలి బ్రేక్ అందించాడు. 22 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న రెహ్మనుల్లా గుర్భాజ్, ఆసియా కప్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...

ఇంతకుముందు 2014 ఆసియా కప్‌లో పాక్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుని, గుర్భాజ్ కంటే ముందున్నాడు. 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసిన రెహ్మనుల్లా గుర్భాజ్... అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో హసరంగకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

రెహ్మనుల్లా గుర్భాజ్‌తో కలిసి రెండో వికెట్‌కి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇబ్రహిం జాడ్రాన్ 38 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి దిల్షాన్ మదుశకన బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

కెప్టెన్ మహ్మద్ నబీ 4 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి మహ్మద్ నబీ అవుట్ కాగా ఆ తర్వాతి బంతికే 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 17 పరుగులు చేసిన నజిబుల్లా జాద్రాన్ రనౌట్ అయ్యాడు...

7 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసిన రషీద్ ఖాన్... ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యాడు. ఒకానొక దశలో 17.1 ఓవర్లు ముగిసే సమయానికి 151/2 స్కోరుతో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 

టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ టోర్నీలో రెహ్మనుల్లా గుర్బాజ్ చేసిన 84 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇంతకుముందు 2016 ఆసియా కప్ టీ20 ఎడిషన్‌లో రోహిత్ శర్మ చేసిన 83 పరుగుల స్కోరును రెహ్మనుల్లా గుర్భాజ్ అధిగమించాడు.. 

Follow Us:
Download App:
  • android
  • ios