Asianet News TeluguAsianet News Telugu

Asia Cup: మెండిస్ మెరుపులు.. సూపర్-4కు లంక.. బంగ్లాకు తప్పని భంగపాటు

Asia Cup 2022: బంగ్లాదేశ్ నిర్దేశించిన  184 పరుగుల లక్ష్యాన్ని.. మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లంక విజయం సాధించి సూపర్-4 కు అర్హత సాధించింది. 

Sri Lanka Beat Bangladesh by 2 wickets and Qualify For Asia Cup 2022 Super - 4
Author
First Published Sep 1, 2022, 11:25 PM IST

ఆసియా కప్ - 2022లో సూపర్-4 ఆశలు  సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో శ్రీలంక బ్యాటర్లు దుమ్మురేపారు.  బంగ్లాదేశ్ నిర్దేశించిన  184 పరుగుల లక్ష్యాన్ని.. మరో 4 బంతులు మిగిలుండగానే ఛేదించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో లంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 60, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. అతడికి తోడుగా దసున్ శనక (33 బంతుల్లో 45, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)  చివర్లో మెరుపులు మెరిపించి  లంకకు విజయాన్ని అందించాడు.  ఈ విజయంతో  లంక సూపర్-4 చేరగా  బంగ్లాదేశ్ ఢాకా విమానమెక్కింది. గ్రూప్-బిలో ఇప్పటికే అఫ్గానిస్తాన్ జట్టు రెండు విజయాలతో సూపర్-4కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. 

భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ముస్తాఫిజుర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో పతుమ్ నిస్సంక (19 బంతుల్లో 20, 2 ఫోర్లు, 1 సిక్సర్)  6, 4  రాబట్టాడు. ఆ తర్వాత ఓవర్లో కుశాల్ మెండిస్  కూడా 6, 6, 4 తో చెలరేగాడు. అయితే ఎబాదత్ హోసేన్ వేసిన ఆరో ఓవర్లో నిస్సంక  ముస్తాఫిజుర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

అదే ఓవర్లో లంకకు మరో షాక్ తగిలింది. వన్ డౌన్ లో వచ్చిన చరిత్ అసలంక (1) కూడా  మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన గుణతిలక  (11) రెండు ఫోర్లు కొట్టి జోరు మీద కనిపించినా ఎబాదత్.. 8వ ఓవర్లో అతడిని కూడా ఔట్ చేశాడు. లంక భారీ ఆశలు పెట్టుకున్న భానుక రాజపక్స (2) కూడా టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో నయీమ్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 9 ఓవర్లకు లంక.. 4 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసి కష్టాల్లో పడింది. 

కానీ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దసున్ శనకతో  కలిసి కుశాల్ మెండిస్ చెలరేగాడు. మెహదీ హాసన్ వేసిన ఆరో ఓవర్లో ఔటయ్యే ప్రమాదం (నోబాల్) తప్పించుకున్న మెండిస్ తనకు దొరికిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. ఎబాదత్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో శనక వరుసగా రెండు సిక్సర్లు బాది స్కోరు వేగాన్ని పెంచాడు. అదే ఓవర్లో మూడో బంతికి మెండిస్.. మిడ్ వికెట్ మీదుగా రెండు పరుగులు తీసి 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ ఓవర్లో లంక మొత్తంగా 22 పరుగులు రాబట్టింది. అయితే స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో మెండిస్.. ముస్తాఫిజుర్ వేసిన 15వ ఓవర్ మూడో బంతికి థర్డ్ మ్యాన్ వద్ద ఉన్న టస్కిన్ అహ్మద్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

మెండిస్ నిష్క్రమించాక వచ్చిన వనిందు హసరంగ (2) ను టస్కిన్ పెవిలియన్ చేర్చాడు. చివరి మూడు ఓవర్లలో 34 పరుగులు అవసరముండగా.. మెహది హసన్ వేసిన 18వ ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన శనక.. ఐదో బంతికి  ముసద్దేక్ హోసేన్ కు క్యాచ్ ఇచ్చాడు. చివరి రెండు ఓవర్లలో 25 పరుగులు చేయాల్సి ఉండగా.. ఎబాదత్ వేసిన 19వ ఓవర్లో 17 పరుగులొచ్చినా లంక కరుణరత్నె వికెట్ ను కోల్పోయింది. దీంతో చివరి ఓవర్లో లంకకు 8 పరుగులు అవసరమయ్యాయి. మెహదీ హసన్ వేసిన చివరి ఓవర్లో రెండో బంతికి ఫోర్ కొట్టిన ఫెర్నాండో (3 బంతుల్లో 10 నాటౌట్, 2 ఫోర్లు) తర్వాత బంతికి  రెండు పరుగులు తీశాడు.  ఆ బంతి నోబాల్ కావడంతో లంక విజయం ఖాయమైంది. బంగ్లా గుండె పగిలింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది.  ఆ జట్ుటలో అఫిఫ్ హుస్సేన్ (39), మెహిది హసన్ (38), ముసద్దేక్ హోసేన్ (27) రాణించారు. లంక బౌలర్లలో హసరంగ, కరుణరత్నె తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios