SL Vs AUS ODI: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న  శ్రీలంకకు కాస్త ఊరటనిచ్చే విషయమిది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ ను లంక గెలుచుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లంక 4 పరుగుల తేడాతో గెలిచింది. 

చాలాకాలంగా గత వైభవాన్ని దక్కించుకునేందుకు ఆరాటపడుతున్న శ్రీలంక.. దేశం క్లిష్టపరిస్థితులలో ఉండగా కీలక ముందడుగు వేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వేళ క్రికెట్ మ్యాచులను నిర్వహించేందుకు కూడా నిర్వహణ ఖర్చుల కోసం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్న ఆ దేశ బోర్డుకు ఇది ఊరటనిచ్చే విజయం. పటిష్ట ప్రత్యర్థిగా ఉన్న ఆస్ట్రేలియాను కంగుతినిపిస్తూ.. మూడు దశాబ్దాల (1992లో చివరిసారి) తర్వాత ఆసీస్ ను లంకలో ముంచింది. కొలంబో వేదికగా జరిగిన నాలుగో వన్డేలో కంగారూలను 4 పరుగుల తేడాతో ఓడించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. 49 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌట్ కాగా.. అనంతరం ఆసీస్.. 50 ఓవర్లలో 254 పరుగుల వద్దే ఆగిపోయింది. ఫలితంగా 4 పరుగుల తేడాతో లంకను విజయం వరించింది. ఈ విజయంతో లంక వన్డే సిరీస్ ను 3-1తో గెలుచుకుంది. 9 ఏండ్ల తర్వాత ఆసీస్ పై వరుసగా మూడు వన్డేలు నెగ్గడం లంకకు ఇదే తొలిసారి కావడం విశేషం. 

అసలంక సెంచరీ..

ఐదు మ్యాచుల సిరీస్ లో భాగంగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లంకేయులు.. 49 ఓవర్లలో 258 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఓపెనర్లు డిక్వెల్ల (1), పతుమ్ నిస్సంక (13), కుశాల్ మెండిస్ (14) లు వెంటవెంటనే నిష్క్రమించారు. కానీ ధనంజయ డి సిల్వ (60) తో కలిసి చరిత్ అసలంక (110) లంకను ఆదుకున్నాడు. ఈ ఇద్దరి వీరోచిత పోరుతో లంక ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ ఇద్దరి తర్వాత కూడా కెప్టెన్ దసున్ షనక (4), వెల్లలగె (19) లు కూడా విఫలమయ్యారు. 

ఓటమిని కొని తెచ్చుకున్న ఆసీస్.. వార్నర్ సెంచరీ మిస్ 

స్వల్ప లక్ష్య ఛేదనలో లంక బౌలర్లు పట్టుదలతో బౌలింగ్ చేశారు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (0), మిచెల్ మార్ష్ (26), మార్నస్ లబూషేన్ (14), అలెక్స్ కేరీ (19) లు విఫలమైనా.. డేవిడ్ వార్నర్ (99) ఆదుకున్నాడు. అతడు ఒక పరుగు తేడాతో సెంచరీ కోల్పోయాడు. ఒక దశలో 189-5 తో పటిష్ట స్థితిలో ఉన్న ఆసీస్.. త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది. మ్యాక్స్వెల్ (1), ట్రావిస్ హెడ్ (27) లు విఫలమయ్యారు. అయితే చివర్లో ప్యాట్ కమిన్స్ (35) రాణించినా విజయానికి చేరువకాలేదు. 

చివర్లో హైడ్రామా.. 

చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 19 పరుగులు అవసరమవగా.. కెప్టెన్ షనక వేసిన ఈ ఓవర్లో ఆసీస్ బ్యాటర్ కునెర్మన్ (15) తొలి బంతికి పరుగుతీయలేదు. ఆ తర్వాత 4,2,4,4తో 14 పరుగులు సాధించాడు. దాంతో ఆసీస్‌ గెలుపునకు ఆఖరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతికి కునెర్మన్‌ను షనక అవుట్‌ చేసి ఈ సిరీస్‌లో లంకకు వరుసగా మూడో విజయాన్ని ఖరారు చేశాడు. ఈ మ్యాచ్ లో లంక తరఫున 8 మంది బౌలింగ్ వేయగా వారిలో ఏడుగురు వికెట్లు తీయడం గమనార్హం. సిరీస్ లో చివరిదైన ఐదో వన్డే శుక్రవారం ఇదే వేదికలో జరుగుతుంది. 

Scroll to load tweet…