శ్రీలంక స్టార్ బ్యాట్స్‌మెన్ లహిరు తిరుమానెతో పాటు హెడ్‌కోచ్ మిక్కీ ఆర్థర్‌ కరోనా బారిన పడ్డారు. వెస్టిండీస్ సిరీస్‌కి ముందు శ్రీలంక జట్టుకి కరోనా ఊహించని రీతిలో షాకిచ్చింది. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల్లో ఓడిన శ్రీలంక, వెస్టిండీస్‌ టూర్‌ కోసం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 20 నుంచి విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది శ్రీలంక జట్టు.

వెస్టిండీస్ టూర్ కోసం 36 మందితో కూడిన క్రికెట్ బృందాన్ని ఎంపిక చేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. ఈ టూర్‌కి బయలుదేరే ముందు అందరికీ కరోనా టెస్టులు చేయగా స్టార్ బ్యాట్స్‌మెన్ లహిరు తిరుమానే, కోచ్ మిక్కీ ఆర్థర్‌లకు పాజిటివ్ ఫలితం వచ్చింది.

‘నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కరోనా సోకిందా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను...’ అంటూ తిరుమానే ట్వీట్ చేశాడు. ఇద్దరికీ కరోనా సోకడంతో విండీస్ టూర్‌ని రీషెడ్యూల్ చేయాలని చూస్తోంది లంక క్రికెట్ బోర్డు.