విరాట్ కోహ్లీ... భారత సారథిగా మంచి విజయాలు అందుకున్నాడు. అయితే కెప్టెన్‌గా వ్యూహరచనలో తనదైన దూకుడు చూపించే విరాట్ కోహ్లీ, డీఆర్ఎస్ విషయంలోనూ అదే దూకుడు చూపిస్తాడు. ‘జెంటిల్మెన్ గేమ్’ క్రికెట్‌లో అన్ని విషయాల్లో దూకుడు పనికి రాదు. ముఖ్యంగా అంపైర్ ఇచ్చిన నిర్ణయాన్ని సమీక్షించే ‘డీఆర్ఎస్’ తీసుకునేటప్పుడు ఎంతో నైపుణ్యం చూపించాలి.

కోహ్లీ విషయంలో అది కొరవడుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే డీఆర్‌ఎస్ తీసుకున్నాడు కోహ్లీ. చాహాల్ బౌలింగ్‌లో మనీశ్ మిస్ అయిన బంతి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. వికెట్ కీపర్ అప్పీలు చేయడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డీఆర్‌ఎస్ తీసుకున్నాడు కోహ్లీ. రిప్లైలో బంతి మనీశ్ బ్యాటుకి తగలనట్టు స్పష్టంగా కనిపించింది. ఆర్‌సీబీ రివ్యూ కోల్పోయింది.

డీఆర్ఎస్ తీసుకునే విషయంలో ధోనీ చాలా పక్కగా ఉంటాడు. ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే... అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే అని నమ్ముతారు క్రికెట్ ఫ్యాన్స్. అందుకే డీఆర్ఎస్ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. కోహ్లీ కాస్త ధోనీని చూసి రివ్యూ ఎలా తీసుకోవాలో, డీఆర్ఎస్‌ను ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...